టీశాట్ ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలను రూపొందించాలి - సీఎస్

ABN , First Publish Date - 2021-11-04T01:26:49+05:30 IST

టీ-శాట్ ద్వారా మరింత ప్రజోపయోగ, సమాచార కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

టీశాట్ ద్వారా ప్రజోపయోగ కార్యక్రమాలను రూపొందించాలి - సీఎస్

హైదరాబాద్: టీ-శాట్ ద్వారా మరింత ప్రజోపయోగ, సమాచార కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సాఫ్ట్ నెట్, టీ.శాట్ కార్యక్రమాలపై బుధవారం బీ.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన వర్కింగ్ బాడీ సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశానికి బీ.ఆర్. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.కె. సీతారామా రావు, ఎంసిఆర్ హెచ్ఆర్ డి. డైరెక్టర్ జనరల్ హరిప్రీత్ సింగ్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు దివ్య దేవరాజన్,తెలంగాణా టెక్నలాజికల్ సర్వీసెస్ ఎండి వెంకటేశ్వర్ రావు,సాఫ్ట్ నెట్ సీఈఓ శైలేష్ రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు. 


ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ,వ్యవసాయ,విద్యా,మహిళా శిశు సంక్షేమ, యువజన, పంచాయితీ రాజ్ శాఖలు తమ విభాగాలకు చెందిన అంశాలపై విజ్ఞాన దాయకమైన కార్యక్రమాలను రూపొందించి టీ.శాట్ ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాల రూపకల్పన పై ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ పామ్ సాగు, హరిత సంపద, పశుపోషణ తదితర అంశాలపై కార్యక్రమాలను రూపొంచాలని సూచించారు.


 పంచాయితీ రాజ్ కు సంబంధించి ఉత్తమ సర్పంచులు కావడానికి మార్గాలు, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామ ఆర్థిక వనరుల పెంపు లాంటి అంశాలు,యువజనులకు సంబంధించి పోటీ పరీక్షల కు తయారీ, కెరీర్ డెవలప్మెంట్, విద్యా పరమైన ప్రావీణ్యత తదితర అంశాలు, పోలీస్ నియామకాలకు సంబందించిన ప్రిపరేషన్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు,గంజాయి సాగు నిషేధం తదితర అంశాలపై కార్యక్రమాలను రూపొందించాలని సి.ఎస్ పేర్కొన్నారు.కార్యక్రమాల రూపకల్పన, ప్రసారాలతో పాటు స్వీయ ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.వివిధ శాఖలకు దృశ్య, శ్రవణ కార్యక్రమాలను సాఫ్ట్ నెట్, టీ.శాట్ ల ద్వారా రూపొందించాలని సూచించారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆన్ లై క్లాసులను అందించడంలో టీ-శాట్ చేసిన కృషిని సి.ఎస్ అభినందించారు.

Updated Date - 2021-11-04T01:26:49+05:30 IST