పోడు భూములపై గిరిజనులకు అవగాహన కల్పించాలి: సీఎస్

ABN , First Publish Date - 2021-10-28T00:51:41+05:30 IST

పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

పోడు భూములపై గిరిజనులకు అవగాహన కల్పించాలి: సీఎస్

హైదరాబాద్: పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందు పరిచే అంశాలు ఇతర అంశాలపై చైతన్య, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ముందు ముందు అటవీ భూముల ఆక్రమణ ఉండదని గ్రామస్తులు అంగీకరించే విధంగా చైతన్య పర్చాలని స్పష్టం చేశారు. డివిజన్, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకాధికారులను నియమించాలని సోమేశ్ కుమార్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, ఏమాత్రం వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. 


విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాలకు సీనియర్ అటవీ శాఖ అధికారులను నియమించాలని అన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 8 వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపొందించే విషయాలపై సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం అటవీ, రెవిన్యూ ఉన్నతాధికారులతో సీఎస్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సీసీఎఫ్ ఆర్.శోభ, రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్ డి ప్రియాంకా వర్గీస్ తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T00:51:41+05:30 IST