వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి: సీఎస్

ABN , First Publish Date - 2021-07-24T23:44:05+05:30 IST

తెలంగాణలో వైద్యరంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి: సీఎస్

హైదరాబాద్: తెలంగాణలో వైద్యరంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య మౌళిక సదుపాయాల అభివృద్ధికై తీసుకున్న చర్యల గురించి  ఆరోగ్య శాఖ అధికారులు ప్రధాన కార్యదర్శికి వివరించారు.  పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని పడకలను ఆక్సిజన్ బెడ్ లుగా మార్పు చేయడం, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, పీడియాట్రిక్ ఆక్సిజన్, ఐసియు బెడ్ ల సంఖ్యను పెంచడం, జిల్లా ఆసుపత్రులను బలోపేతం చేయడం, అప్ గ్రేడ్ చేయడం అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. 


ఇప్పటికే ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని, తగినన్నిమందులు నిల్వఉండేలా చూడాలని, డయగ్నోస్టిక్ ఎక్విప్ మెంట్, బయోమెడికల్ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, ఇతర నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త వైద్య కళాశాలలకు సంబంధించి పురోగతి గురించి కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 


ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ, డిజాస్టర్ మేనేజ్ మెంట్  కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ సిఐజి వి.శేషాద్రి,  ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.జి.శ్రీనివాస రావు , మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ ఎంఎస్ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, టిఎస్ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ముఖ్యమంత్రి  కార్యాలయ ఓఎస్ డి గంగాధర్, ఆర్ అండ్ బి ఇఎన్ సి  గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-24T23:44:05+05:30 IST