రూటు మార్చిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-09-08T15:40:13+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూటు మార్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

రూటు మార్చిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూటు మార్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. జీవోలన్నీ ఇకపై ‘ఏపీ ఈ-గెజిట్‌’లో పెడతామని ప్రకటించింది. జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా నిలిపివేసిన ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీవోలను ఈ-గెజిట్‌ ద్వారా జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ఐఆర్ వెబ్ సైట్‌ను నిలిపివేసినందున సమాచారం హక్కు ప్రయోజనాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రజలు అవసరం లేని సమాచారాన్ని ఈ-గెజిట్‌లో ఉంచబోమని వెల్లడించారు. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్‌ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.


 ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు జీవోలన్నీ జీవోఐఆర్.ఏపీ. goir.ap.gov.in అనే వెబ్ సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేది. అయితే ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్‌లో ఉన్న జీవోలను తీసివేస్తున్నమని, పబ్లిక్ డొమైన్‌లో ఉంచకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. దీనిపై ప్రజాప్రయోజన వాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. ఆ కేసులు విచారణకు వస్తున్న తరుణంలో లేనిపోని తలనొప్పులు ఎందుకని భావించిన ప్రభుత్వం జీవోఐఆర్‌ స్థానంలో జీవోలన్నీ ‘ఏపీ ఈ-గెజిట్‌’ వెబ్ సైట్‌లో పెడతామని ప్రకటించింది. అయితే ప్రజలకు అవసరంలేని వ్యక్తిగత సమాచారాన్ని ఈ-గెజిట్‌లో పెట్టబోమని వెల్లడించింది. తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, ఇతర అంశాలు గోప్యంగా ఉంచాల్సిన అంశాలను ఈ-గెజిట్‌లో పెట్టమని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-08T15:40:13+05:30 IST