Abn logo
Sep 26 2021 @ 17:41PM

చైనా బ్యాంకు ప్రకటన... గంటలోనే క్రిప్టోలు 4 శాతం పతనం

బీజింగ్ : బిట్ కాయిన్ సహా పలు క్రిప్టో కరెన్సీలు ఈ వారం భారీగా పడిపోయాయి. బిట్ కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీలతో కూడిన లావాదేవీలు  చట్టవిరుద్దమని చైనా కేంద్ర బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే. డిజిటల్ కరెన్సీ అనధికార వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. క్రిప్టో కరెన్సీలను నిర్వహించకుండా 2013 లోనే చైనా బ్యాంకులపై నిషేధం విధించారు. కాగా... ప్రభుత్వం ఈ ఏడాది మళ్లీ ఓ ప్రకటన చేసింది. ఈ ప్రభావం క్రిప్టో కరెన్సీ పై పడింది.


గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందు సెషన్‍‌తో పోలిస్తే చివరి సెషన్‌లో  4.23 శాతం క్షీణించ 1.91 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 24 గంటల్లో 134.58 బిలియన్ డాలర్లుగా నమోదైంది. బిట్‌ కాయిన్ ధర ప్రస్తుతం 42,574.50 డాలర్లు (రూ. 31,40,977) వద్ద ఉంది. క్రిప్టో మార్కెట్‌లో  బిట్ కాయిన్ వాటా 42.04 శాతంగా ఉంది. అంతకుముందు సెషన్‌తో పోలిస్తే బిట్‌కాయిన్ మార్కెట్ వాటా 0.08 శాతం క్షీణించింది.


చైనా కేంద్ర బ్యాంకు ప్రకటన తర్వాత గంటలోనే బిట్ కాయిన్ విలువ నాలుగు శాతం మేర పడిపోయింది. బిట్ కాయిన్, ఎథేరియం, ఇతర డిజిటల్ కరెన్సీలు ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, మనీలాండరింగ్, ఇతర నేరాలలో ఉపయోగిస్తున్నారని పేర్కొంది చైనీస్ బ్యాంకు. వర్చువల్ కరెన్సీ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ‌ను చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలగా పరిగణిస్తున్నామని, ఈ క్రమంలో... వీటిని నిషేధిస్తున్నామని ప్రకటించింది.