Tip: రెస్టారెంట్‌ ఉద్యోగికి భారీ సర్‌ప్రైజ్.. అతడి ఉదారత చూసి ఆమెకు కన్నీళ్లాగలేదు..!

ABN , First Publish Date - 2022-07-25T01:17:36+05:30 IST

అమెరికా రెస్టారెంట్‌లో పని చేస్తున్న మహిళ.. కస్టమర్ చూపిన ఉదారతతో కన్నీళ్లు ఆగలేదు.

Tip: రెస్టారెంట్‌ ఉద్యోగికి భారీ సర్‌ప్రైజ్.. అతడి ఉదారత చూసి ఆమెకు కన్నీళ్లాగలేదు..!

ఎన్నారై డెస్క్: రెస్టారెంట్‌లో పని చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని చాలా మంది వెయిటర్లు చెబుతుంటారు. గంటల తరబడి నిలబడటం.. కస్టమర్లకు కావాల్సింది తెచ్చి ఇచ్చేందుకు పలుమార్లు తిరగడం.. ఇలా వెయిటర్ విధి చాలా శారీరక శ్రమతో కూడుకున్నదని చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో కస్టమర్లు అసహనంతో వ్యవహరించినా తాము ఓపిగ్గా ఉండాల్సి ఉంటుందని అంటారు. అందుకే.. బిల్లు చెల్లించేముందు అనేక మంది కస్టమర్లు వెయిటర్లకు ఎంతో కొంత టిప్ ఇస్తుంటారు. అయితే.. ఓ అమెరికా రెస్టారెంట్‌లో పని చేస్తున్న మహిళకు కస్టమర్ ఉదారత చూసి కన్నీళ్లు ఆగలేదు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


పెన్సిల్వేనియా(Pennsylvania) రాష్ట్రం స్క్రాంటాన్ ప్రాంతంలో ఆల్ఫ్రెడో కేఫ్ ఉంది. జూన్ 16న ఆ రెస్టారెంట్‌కు ఎరిక్ స్మిత్ వచ్చారు. ఆయన ఓ క్రిప్టో కరెన్సీ‌(Cryptocurrency) ట్రేడర్. అంటే..డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తుంటాడు. కాగా.. ఆ రోజు రెస్టారెంట్‌లో చేసిన వంటకం ఎరిక్‌కు బాగా నచ్చింది. దీంతో.. ఆయన వెయిటర్‌కే ఏకంగా 3 వేల డాలర్లు(సుమారు రూ.2.3 లక్షలు) టిప్(Tip) ఇచ్చాడు. ఆయన బిల్లు కేవలం 13 డాలర్లే(సుమారు రూ. వెయ్యి) అయినా టిప్ విషయంలో మాత్రం ఉదారత ప్రదర్శించారు. తనకు ఆ వంటకాన్ని తెచ్చి ఇచ్చి మారియానా లాంబర్ట్‌కు భారీ స్థాయిలో టిప్ ఇచ్చారు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బై కన్నీళ్ల పర్యంతమైంది. ‘‘ఈ రోజుల్లో సామాన్యులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి టైంలో ఆ టిప్ చూసిన నాకు కన్నీళ్లు ఆగలేదు’’ అని మీడియా ముందు వ్యాఖ్యానించింది. అయితే టిప్ ఇస్తూ.. ‘ఇది దేవుడి పేరున ఇస్తున్నాం..’’ అని బిల్లుపై ఎరిక్ రాయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారీగా ఆస్తిపాస్తులున్న తాను సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పారు. 

Updated Date - 2022-07-25T01:17:36+05:30 IST