ట్యాంకర్‌ ఢీకొని క్రషర్‌ కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-05-17T06:37:48+05:30 IST

మండలంలోని కశింకోట- బంగారుమెట్ట (కేబీ) రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు

ట్యాంకర్‌ ఢీకొని క్రషర్‌ కార్మికుడి మృతి
సాలాపు ఈశ్వరరావు (ఫైల్‌ ఫొటో)


విధుల అనంతరం మోపెడ్‌పై వస్తుండగా ప్రమాదం

బుచ్చెయ్యపేట, మే 16 : మండలంలోని కశింకోట- బంగారుమెట్ట (కేబీ) రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలివి.  కందిపూడికి చెందిన సాలాపు ఈశ్వరరావు (55) వేటజంగాలపాలెం స్టోన్‌ క్రషర్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం విధులకు హాజరైన  అతడు సోమవారం ఉదయం విధుల అనంతరం స్వగ్రామానికి మోపెడ్‌పై బయల్దేరాడు.  రాజాం రెవెన్యూ పరిధి కేబీ రోడ్డులో గల తూనిక కేంద్రం వద్దకు చేరుకోగా,  ఎదురుగా వస్తున్న సెప్టిక్‌ ట్యాంకర్‌ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ట్యాంకర్‌ డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పరుగుతీశాడు. స్థానిక యువకులు బైక్‌పై వెంబడించి అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతుడి భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈశ్వరరావు మృతితో భార్య, ముగ్గురు కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


లారీని ఢీకొన్న వ్యాన్‌... క్లీనర్‌ మృతి

ఎస్‌.రాయవరం, మే 16: మండలంలోని గోకులపాడు సమీపంలో జాతీయ రహదారిపై లారీని వ్యాన్‌ ఢీకొనడంతో క్లీనర్‌ మృతి చెందాడు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ చేపల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌, ఆదివారం అర్ధరాత్రి గోకులపాడు సమీపంలోకి వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఢీకొందని చెప్పారు. వ్యాన్‌ ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో, అందులో ఉన్న కోల్‌కతాకు చెందిన క్లీనర్‌ సొనాట ముర్ము (57) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ మహమ్మద్‌ కలీమ్‌ గాయాలతో బయటపడ్డాడు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మృతుడు వెంకన్నపాలెం వాసిగా గుర్తింపు

కొత్తూరు, మే 16: కారు టైరు పేలి దూసుకెళ్లిన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నంబారు వెంకటరమణ (48)గా పోలీసులు గుర్తించారు. పిసినికాడ పంచాయతీ కూడలి వద్ద ఈ నెల 13న ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కూలి కోసం అనకాపల్లి వెళ్లిన భర్త తిరిగి రాకపోవడంతో భార్య సత్యవతి రూరల్‌ పోలీసులను సంప్రదించారు. అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూపించడంతో వెంకటరమణగా గుర్తించారు. భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రూరల్‌ ఎస్‌ఐ సిహెచ్‌.నరసింగరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి కుటుంబీకులకు అప్పగించారు. వెంకటరమణకు ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయామంటూ వారు భోరున విలపిస్తున్నారు. 


పెళ్లి పేరుతో మోసగించిన యువకుడి అరెస్టు

సబ్బవరం, మే 16: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముఖం చాటేసిన యువకుడ్ని అరెస్టు చేసినట్టు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు.  మండలంలోని అసకపల్లి శివారు ఎరుకునాయుడుపాలెం గ్రామానికి చెందిన పాము యమున, అదే గ్రామానికి చెందిన అటో డ్రైవర్‌ బందం అప్పలనాయుడు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేరొక యువతితో అప్పలనాయుడు వివాహానికి ఏర్పాట్లు చేసుకోవడంతో యమున వెళ్లి నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడింది. దానికి అప్పలనాయుడు అంగీకరించకపోవడంతో మూడు రోజుల క్రితం యమున ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు, అప్పలనాయుడు రక్షించి సబ్బవరం తీసుకొచ్చారు. మరోసారి పెళ్లి చేసుకోవాలని కోరినా ససేమిరా అనడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పలనాయుడుపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సోమవారం కోర్టుకు తరలించినట్టు సీఐ తెలిపారు. 


2 తులాల బంగారం చైన్‌ స్నాచింగ్‌

నర్సీపట్నం, మే 16 : పట్టణంలోని ఓ మహిళ మెడలో రెండు తులాలు బంగారు ఆభరణాన్ని దుండగుడు తెంచుకుపోయాడు. శారదానగర్‌లో నివాసం ఉంటున్న సబ్‌ ట్రెజరీ ఉద్యోగి సీహెచ్‌.తారకరామారావు కుమార్తె వివాహం ఈ నెల 20 తేదీన జరగనుంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అతని అత్త సురభిలక్ష్మి విశాఖపట్నం నుంచి నర్సీపట్నానికి బస్సులో వచ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు దిగి శారదానగర్‌ రెండో లైన్‌లోని రామారావు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని తెంచుకుని పారిపోయాడు. బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


అనుమానాస్పదంగా యువకుడు... కేసు నమోదు

సబ్బవరం, మే 16: మండలంలోని వెదుళ్లనరవ గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడ్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి పీసీఆర్‌కే.నాయుడు, హోమ్‌గార్డు రమేశ్‌ గ్రామంలో నైట్‌ బీట్‌ కాస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో కొవ్వొత్తులు, అగ్గిపెట్టితో కంసాలరెడ్డప్ప గంగరాజు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. అతనిది కర్నాటక రాష్ట్రంలోని కల్లార్‌ జిల్లా రాయపాడు గ్రామమని తెలిపాడు. కాగా కుటుంబ తగాదాలతో రైలు ఎక్కి ఇక్కడికి వచ్చినట్టు గంగరాజు సోదరి ఫోన్‌లో తెలిపినట్టు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు.

  

కొత్తపోలవరంలో యువకుడి అదృశ్యం

ఎస్‌.రాయవరం, మే 16: మండలంలోని కొత్తపోలవరం గ్రామానికి చెందిన మామిడి ప్రసాద్‌ కనబడడం లేదని ఫిర్యాదు అందినట్టు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రసాద్‌ ఒంగోలులోని ఓ రొయ్యల పరిశ్రమలో పని చేస్తున్నాడని, పది రోజుల క్రితం స్వగ్రామం పోలవరం వచ్చాడని చెప్పారు. తిరిగి ఈ నెల 13న ఒంగోలు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరాడన్నాడు. తరువాత నుంచి కుమారుడి ఆచూకీ లేదని, ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తున్నదని అతని తండ్రి ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.


Updated Date - 2022-05-17T06:37:48+05:30 IST