కొండను పిండి చేసి.. మట్టిని మింగేసి..

ABN , First Publish Date - 2021-06-24T04:38:08+05:30 IST

అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. కొండలు, చెరువు గర్భాన్ని కూడా మింగేస్తున్నారు.

కొండను పిండి చేసి.. మట్టిని మింగేసి..
మట్టిని అక్రమంగా తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌ ఫొటో)

ముదపాకలో చెలరేగిపోతున్న అక్రమార్కులు

కొండను తవ్వి దర్జాగా గ్రావెల్‌ తరలింపు

చెరువు మట్టిని తరలించి విక్రయం

అధికార పార్టీ నాయకులు కావడంతో పట్టించుకోని అధికారులు


పెందుర్తి, జూన్‌ 23: అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. కొండలు, చెరువు గర్భాన్ని కూడా మింగేస్తున్నారు. మండలంలోని ముదపాకలో ఎటువంటి అనుమతు లు లేకుండా కొండను తవ్వి గ్రావెల్‌  తరలించుకుపోతున్నారు. అలాగే సమీపంలో సర్వే నంబర్‌ 92లో తొమ్మిది ఎకరాల్లో ఉన్న కోసినివాని చెరువు మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. ఆరు నెలలుగా యంత్రాలతో కొండను, ఎక్సకవేటర్లతో చెరువును తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు గర్భాన్ని సుమారు ఐదు అడుగుల లోతు వరకు తవ్వేశారు. ఇక్కడ నుంచి తరలించి లారీ మట్టిని రూ.2,500 విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఈ అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన నాయ కులు ఉండడం వల్లే సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముదపాకలో గ్రావెల్‌ తవ్వకాలపై టీడీపీ నాయ కుడు గొలగాని సత్యనారాయణ ఇటీవల పెందుర్తి తహసీల్దార్‌  కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం

ముదపాకలో గ్రావెల్‌, మట్టి తవ్వకాల వ్యవహారం మా దృష్టికి వచ్చింది.  దీనిపై పూర్తి వివరాలు సేకరించాలని వీఆర్వోను ఆదేశించా. మట్టిని తరలించే వాహనాలను గతంలో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాల విషయంలో విచారణ చేపట్టి అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

                              - పైల రామారావు, తహసీల్దార్‌ 


సీపీకి టీడీపీ నేత ఫిర్యాదు

ముదపాకలో మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను అధికారుల దృష్టికి తెచ్చి నిలువరించేందుకు ప్రయత్నించిన తనపై కక్ష గట్టిన అధికార పార్టీకిచెందిన అక్రమార్కుల నుంచి తనకు ప్రాణహాని ఉందని గోవిందపురానికి చెందిన టీడీపీ నాయకుడు గొలగాని సత్యనారాయణ బుధవారం పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుడు ఎం.శివ తన ఇంటికి వచ్చి మట్టి తవ్వకాలు అడ్డుకుంటావా? అని తనను దుర్భాషలాడాడని తెలిపారు. అతనితో వచ్చిన దేముడు, రమణ అనే వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.


Updated Date - 2021-06-24T04:38:08+05:30 IST