Abn logo
Sep 21 2021 @ 00:55AM

క్రూరత్వానికి శిక్ష పడాల్సిందే

  • సమాజం పట్ల నేరాన్ని ఉపేక్షించలేం
  • స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: క్రూరత్వానికి శిక్ష పడాల్సిందేనని, సమాజం పట్ల దారుణమైన నేరాలను ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై మహారాష్ట్రకు చెందిన భగవాన్‌ నారాయణ్‌ గైక్వాడ్‌ అనే వ్యక్తి చేసిన అప్పీల్‌పై తీవ్రంగా స్పందించింది. 1993 డిసెంబరు 13న సుభాష్‌ యాదవరావ్‌ పాటిల్‌ అనే వ్యక్తిపై గైక్వాడ్‌ తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో పాటిల్‌ ఒక చేతిని, ఒక కాలిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఈ కేసుపై ట్రయల్‌ కోర్టులో విచారణ పూర్తయి.. అక్కడ శిక్షపడ్డాక నిందితుడు బాంబే హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేల జరిమానా విధించింది. బాధితుడికి రూ. 2 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై గైక్వాడ్‌ సుప్రీంకోర్టుకెక్కాడు. ఈ అప్పీల్‌ను జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అభయ్‌ ఒకాతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.


గైక్వాడ్‌ తరఫున మహేశ్‌ జఠ్మలానీ వాదిస్తూ.. గైక్వాడ్‌, పాటిల్‌ మధ్య రాజీ కుదిరింది అని వివరించారు. దానిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.


‘‘గైక్వాడ్‌ది అత్యంత క్రూరమైన చర్య. అతని చర్య వల్ల ఓ వ్యక్తి శాశ్వతంగా దివ్యాంగుడయ్యాడు. అప్పట్లో ఆయనకు చికిత్సనందించిన వైద్యుడి వాంగ్మూలం ఆ క్రూరత్వంలో తీవ్రతను చెబుతోంది. సకాలంలో చికిత్స అందించకుంటే.. పాటిల్‌ చనిపోయేవాడన్నారు. ఆ మేరకు మరణ వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఇంతకంటే క్రూరత్వం ఏమైనా ఉంటుందా? సమాజం పట్ల ఇలాంటి క్రూరత్వాలను ఉపేక్షించేది లేదు’’ అని వ్యాఖ్యానించింది. కోర్టుల్లో తీర్పు వెలువడే సమయంలో జరిగే రాజీ సరికాదని, క్రూరత్వానికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ.. అప్పీల్‌ను కొట్టివేసింది.