17 ఏళ్ల కనిష్ఠ స్థాయికి క్రూడాయిల్‌

ABN , First Publish Date - 2020-03-31T06:56:29+05:30 IST

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర సోమవారం మరిం త పడిపోయింది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో పీపా (బ్యారల్‌) బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 23 డాలర్లకు...

17 ఏళ్ల కనిష్ఠ స్థాయికి క్రూడాయిల్‌

  • దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతథం
  • ‘ఎక్సైజ్‌’ రూపంలో బాదేస్తున్న ప్రభుత్వం 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో  ముడి చమురు ధర సోమవారం మరిం త పడిపోయింది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో పీపా (బ్యారల్‌) బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 23 డాలర్లకు దిగొచ్చింది.  2002 నవంబరు తర్వాత బ్రెంట్‌ ముడి చమురు ధర ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాలో ఉత్పత్తి అయ్యే ముడి చమురు ధర కూడా సోమవారం కొద్దిసేపు 20 డాలర్ల దిగువన ట్రేడైంది. కరోనా వైర్‌సతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పడిపోవడం, డిమాండ్‌ను మించి సరఫరా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కాగా ఏప్రిల్‌ 1 నుంచి సౌదీ అరేబియా, రష్యా రోజువారీ ఉత్పత్తిని 36 లక్షల పీపాల మేర పెంచబోతున్నాయి. సౌదీ అరేబియా అయితే మే నెల నుంచి రోజువారీ ఎగుమతులనూ ప్రస్తుత కోటి బ్యారళ్ల నుంచి 1.6 కోట్ల బ్యారళ్లకు పెంచాలని నిర్ణయించింది. దీంతో బ్యారల్‌ ముడి చమురు ధర త్వరలోనే 20 డాలర్ల దిగువకు దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


దేశీయంగా అవే ధరలు

ఈ నెల 16 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 20 శాతం వరకు తగ్గింది. భారత వినియోగదారులకు మాత్రం ఆ ప్రయోజనం దక్కడం లేదు. ఆయిల్‌ కంపెనీలు గత 14 రోజులుగా అవే ధరలు కొనసాగిస్తున్నాయి. ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం  లీట ర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని మూడు రూపాయలు పెంచడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ రూ.3 భారాన్ని భర్తీ చేసుకునేందుకు ఆయిల్‌ కంపెనీలు గత 14 రోజులుగా అవే ధరలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్నారు. 


భారత్‌లో తగ్గటం డౌటే

బ్యారల్‌ ముడి చమురు ధర 20 డాలర్ల దిగువకు దిగొచ్చినా మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర పెద్దగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. కరోనా దెబ్బతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇటీవలే రూ.1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. అదే సమయంలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై  ఎక్సైజ్‌ సుంకాన్ని మరో రూ.8 పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఉత్పత్తులపై  ఎక్సైజ్‌ సుంకం లీటర్‌కు రూపాయి పెంచినా కేంద్ర ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.14,500 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఉద్దీపన ప్యాకేజీ కోసం ఖర్చు చేసే రూ.1.7 లక్షల కోట్లను ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ఎక్సైజ్‌ సుంకం రూపంలో రాబట్టుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


మళ్లీ చతికిలపడిన స్టాక్‌ మార్కెట్‌

స్టాక్‌ మార్కెట్‌ సోమవారం మళ్లీ చతికిలపడింది. వారం ప్రారంభం తొలి రోజే సెన్సెక్స్‌ 1,375.27 పాయింట్ల నష్టంతో 28,440.32 వద్ద, నిఫ్టీ 379.15 పాయింట్ల నష్టంతో 8,281.10 వద్ద క్లోజయ్యాయి. దీంతో బీఎ్‌సఈలో నమోదైన కంపెనీల షేర్ల  మార్కెట్‌ విలువ దాదాపు రూ.2.85 లక్షల కోట్ల మేర తుడిచి పెట్టుకుపోయింది.


అమ్మకాల హోరుతో ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్‌ 1,500 పాయింట్లకుపైగా నష్టపోయింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో కేవలం ఆరు కంపెనీల షేర్లు మాత్రమే కొద్దిపాటి లాభాలతో క్లోజయ్యాయి. కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరగడం, రేటింగ్‌  ఏజెన్సీలు భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను వరుసపెట్టి కుదించడం, కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు మార్కెట్‌ను భయపెట్టాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించిందన్న ఐఎంఎఫ్‌ హెచ్చరికా, మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. 


Updated Date - 2020-03-31T06:56:29+05:30 IST