యాదాద్రిలో భక్తజనుల రద్దీ

ABN , First Publish Date - 2021-10-25T06:09:17+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడం తో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్ర సందర్శనకు వచ్చారు.

యాదాద్రిలో భక్తజనుల రద్దీ
బాలాలయంలో నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహిస్తున్న అర్చకులు

సందడిగా ఆలయ తిరువీధులు

స్వామి ధర్మదర్శనాలకు మూడు గంటలు


యాదాద్రి టౌన్‌, అక్టోబరు 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడం తో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్ర సందర్శనకు వచ్చారు. కొండకింద తులసీకాటేజ్‌ స్వామివా రి కల్యాణకట్ట వద్ద మొక్కు తలనీలాలు సమర్పించిన యాత్రీకులు తాత్కాలిక షవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి ఆర్జిత సేవలు, హరిహరుల దర్శనాల కోసం కొండపైకి వెళ్లారు. కొండపైకి వాహనాలు అనుమతి లేకపోవడంతో భక్తులు దేవస్థాన, ఆర్టీసీ, ప్రైవేటు ఆటోలను ఆశ్రయించారు. భక్తుల సంచారంతో ఆలయ తిరువీధులు, సే వా మండపాలు, ఉభయ దర్శనాల క్యూలైన్లు కిక్కిరిశాయి. స్వామివారి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్టు భక్తులు తెలిపారు. 132మంది దంపతులు సత్యనారాయణస్వామి వ్రతపూజ ల్లో పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు. బాలాలయ కవచమూర్తులను దర్శించుకున్న భక్తులు సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. దీంతో స్వామికి సువర్ణ పుష్పార్చన పూజల ద్వారా రూ.1.37లక్షల ఆదాయం సమకూరింది. వివిధ విభాగాల ద్వారా రూ.17,60,736 ఆదాయం లభించింది. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల కోలాహలం నెలకొంది. ఇదిలా ఉండగా, భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో రావడంతో పట్టణంలో రద్దీ కొనసాగింది. భక్తుల వాహనాలను కొండకింద వైకుంఠద్వారం నుంచి రింగురోడ్డు, గండి చెరువు మీదుగా పోలీసులు తరలించారు. దీంతో వైకుంఠద్వారం ప్రాంతం వద్ద భక్తుల వాహనాల రద్దీ ఏర్పడింది. రింగురోడ్డు రహదారి కిటకిటలాడింది. పట్టణంలో పలుమార్లు ట్రాఫిక్‌జాం ఏర్పడగా, పోలీసులు క్రమబద్ధీకరించారు. 


వైభవంగా నిత్యార్చనలు

పంచనారసింహుడుకి ఆదివారం నిత్యార్చనలు వైభవంగా కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువుల ను సుప్రభాతంతో మేల్కొలిపి బాలాలయంలోని కవచమూర్తులను ఆరాధించారు. బాలాలయ మండపంలో ఉత్సవమూర్తును అభిషేకించి తులసీ దళాలతో అర్చించా రు. అనంతరం సుదర్శన శతక పఠనంతో హోమ పూజలు, నిత్యకల్యాణ వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, వేదాశీర్వచనాలు, కొండకింద పాత గోశాలలోని వ్రత మండపంలో సత్యదేవుడి వ్రతారాధనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి ఆరాధనలు, ఉప ఆలయంలో చరమూర్తులకు నిత్య పూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు.


వడి వడిగా మెట్ల మార్గం పనులు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనాల కోసం వచ్చే మెట్ల మార్గంలో కృష్ణరాతి శిలల నిర్మాణ పనులను వైటీడీఏ అధికారులు వడివడిగా నిర్వహిస్తున్నారు. కృష్ణరీతి శిలలను భారీ వాహనాల్లో కొండపైకి శివాల యం ప్రాం తానికి ఆదివారం తరలించారు. కొండకింద వైకుంఠద్వారం నుంచి కొండపైన శివాలయం వరకు మెట్ల మార్గం పనులు ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. గడువులోగా మెట్ల మార్గం పనులు పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-25T06:09:17+05:30 IST