యాదాద్రిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-01-27T05:05:21+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ ఏర్పడింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడం తో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నృసింహుడి దర్శనం కోసం వచ్చారు. వేకువజామున ఇష్టదేవుడి దర్శనాలు, మొక్కు పూజల కోసం క్యూలైన్లలో నిలుచున్నారు.

యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి బాలాలయంలో కిక్కిరిసిన భక్తులు

యాదాద్రి టౌన్‌, జనవరి 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ ఏర్పడింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు కావడం తో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నృసింహుడి దర్శనం కోసం వచ్చారు. వేకువజామున ఇష్టదేవుడి దర్శనాలు, మొక్కు పూజల కోసం క్యూలైన్లలో నిలుచున్నారు. ధర్మదర్శనాలకు 3గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. క్షేత్రపాలకుడు ఆంజనేయుడిని పంచామృతాలతో అభిషేకించి సింధూరంతో అలంకరించారు. అనంతరం సహస్రనామ పఠనాలతో నాగవళ్లి దళార్చన చేశారు. బాలాలయంలో ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు, హోమం, నిత్యతిరుకల్యాణోత్సవం సంప్రదాయ రీతిలో నిర్వహించారు. కాగా, ఆలయానికి రూ.16,57,851 ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా, యాదాద్రీశుడిని బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్ర వెంకటేశం, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ జాయింట్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌, భూసేకరణ ఓఎస్డీ మనోహర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఒకరి సస్పెన్షన్‌, నలుగురికి షోకాజ్‌

యాదాద్రి ఆలయంలో ప్రసాదాల స్టాక్‌ నిర్వహణలో వ్యత్యాసం, ప్రసాదాల విక్రయ సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు రుజువు కావడంతో ప్రసాదాల కౌంటర్‌ ఇన్‌చార్జి సీనియర్‌ అసిస్టెంట్‌ శివకుమార్‌ను సస్పెండ్‌ చేసినట్టు దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. అదేవిధంగా, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు వివేక్‌, అన్నపూర్ణతో పాటు ప్రసాదాల తయారీ ఇన్‌చార్జి సినియర్‌ అసిస్టెంట్‌ శంకర్‌, ఆ శాఖ సూపరింటెండెంట్‌ అన్నదానం శంకరశర్మకు షోకాజు జారీచేశామన్నారు.

Updated Date - 2021-01-27T05:05:21+05:30 IST