గుడి గంట మోగింది

ABN , First Publish Date - 2021-06-21T05:52:45+05:30 IST

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో 45 రోజుల అనంతరం భక్తులను అనుమతించారు. కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా మే 5న స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం లాక్‌డౌన్‌ విధించడంతో ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఆదివారం నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌ తొలగించడంతో దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశానుసారం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు.

గుడి గంట మోగింది
హుస్నాబాద్‌ ఎల్లమ్మ ఆలయ ఆవరణలో భక్తుల సందడి

నెలన్నర అనంతరం ఆలయాల్లో భక్తుల దర్శనానికి అనుమతి

చేర్యాల, జూన్‌ 20: కొమురవెల్లి మల్లన్న ఆలయంలో 45 రోజుల అనంతరం భక్తులను అనుమతించారు. కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా మే 5న స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం లాక్‌డౌన్‌ విధించడంతో ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఆదివారం నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్‌  తొలగించడంతో దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశానుసారం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజామునే అర్చకులు ఆలయ ద్వారాలను తెరిచి ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్థానికులేకాకుండా చుట్టుపకష్ట్రల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.


కొండపోచమ్మను దర్శించుకున్న భక్తులు

జగదేవపూర్‌, జూన్‌ 20: జగదేవపూర్‌ మండలంలోని తిగుల్‌నర్సాపూర్‌ని కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆలయాన్ని మూసివేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆదివారం ఆలయంలో భక్తులను అనుమతించారు. ఉదయాన్నే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హైదరాబాద్‌ నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. 


ఎల్లమ్మ  జాతరలో భక్తుల కోలాహలం

హుస్నాబాద్‌, జూన్‌ 20: లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఆదివారం హుస్నాబాద్‌ ఎల్లమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభమై 26 రోజులు గడిచినా లాక్‌డౌన్‌ కారణంగా ఆలయాన్ని తెరువలేదు. జాతర నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా గుడి తెచుకోవడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకుని వనభోజనాలు చేశారు.


ఏడుపాయలలో భక్తుల సందడి

పాపన్నపేట, జూన్‌ 20: లాక్‌డౌన్‌ తొలగించడంతో ఆదివారం ఏడుపాయలలో భక్తుల సందడి నెలకొన్నది. నెల రోజులుగా నిత్యపూజలకే పరిమితమైన ఆలయంలో భక్తులను అనుమతించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది కరోనా నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2021-06-21T05:52:45+05:30 IST