ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి!

ABN , First Publish Date - 2021-03-08T08:31:41+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఆదివారం రేషన్‌డీలర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టండి!

  • ఓర్వలేక చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దు
  • బీజేపీకి బుద్ధి చెపాలి: మంత్రి గంగుల కమలాకర్‌

హైదరాబాద్‌, మార్చి 7(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఆదివారం రేషన్‌డీలర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో రేషన్‌ డీలర్లు చక్కటి పనితీరును కనబర్చారని ప్రశంసించారు. పౌరసరఫరాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రేషన్‌ డీలర్ల సంక్షేమానికి రూ.164 కోట్ల కమీషన్‌ నిధులు విడుదల చేశామని, కారుణ్య నియామకాల వయో పరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంచామన్నారు. గన్నీ బ్యాగుల ధరను రూ.16 నుంచి రూ.18కి పెంచామని చెప్పారు. రెండేళ్లపాటు కొనసాగే ఆథరైజేషన్‌ను ఐదేళ్లకు పెంచామని, రేషన్‌ డీలర్ల గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రతిపాదనలూ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఓర్వలేక చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని, కేవలం పబ్బం గడుపుకునే మాటలతో బీజేపీ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఉన్నత విద్యావేత్త వాణీదేవికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సహకరిస్తామని, ఒక్కొక్కరం ఐదువందల మందితో ఓట్లు వేయించేందుకు కృషి చేస్తామని రేషన్‌ డీలర్ల సంఘం ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. కాగా, టూరిజం ప్లాజాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ ఇన్‌చార్జిలతో మంత్రులు గంగుల, తలసాని, మహమూద్‌ అలీ సమావేశమయ్యారు. ఎంపీ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T08:31:41+05:30 IST