గుడి స్థలం వివాదం

ABN , First Publish Date - 2021-06-24T06:05:23+05:30 IST

అక్కడ ప్రహరీగోడ కట్టి మధ్యలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో ఆలయం ఏర్పాటు చేస్తామంటున్నారు స్థానికులు. అది ప్రభుత్వ స్థలమని అక్కడ అర్బన హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామంటూ ప్రహరీగోడ కూల్చేందుకు వచ్చారు రెవెన్యూ అధికారులు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు.

గుడి స్థలం వివాదం
ఎక్సకవేటర్‌తో ప్రహరీగోడను తొలగిస్తున్న దృశ్యం

స్థానికులు, పోలీసుల మధ్య తోపులాట
మూడు గంటల పాటు ఉద్రిక్తత
కడప(నాగరాజుపేట), జూన 23:
అక్కడ ప్రహరీగోడ కట్టి మధ్యలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో ఆలయం ఏర్పాటు చేస్తామంటున్నారు స్థానికులు. అది ప్రభుత్వ స్థలమని అక్కడ అర్బన హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేయనున్నామంటూ ప్రహరీగోడ కూల్చేందుకు వచ్చారు రెవెన్యూ అధికారులు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో మూడు గంటలపాటు ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా..
కడప నగరంలోని నిరంజననగర్‌ ఎస్టేట్‌లోని సర్వే నంబరు 906లో అన్నపూర్ణా కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానం నిర్మించనున్నారు. 2004లో అప్పటి చిన్నచౌకు సర్పంచ, ప్రస్తుత మేయర్‌ సురే్‌షబాబు సతీమణి జయశ్రీ హయాంలో తీర్మానం చేసి గుడికి శంకుస్థాపన చేయడంతో గుడి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆలయ కమిటీవారు పేర్కొన్నారు. ఇక్కడ మూడు నెలల క్రితం 180 అడుగుల పొడవు, 82 అడుగుల వెడల్పుతో ప్రహరీగోడ నిర్మించి మధ్యలో విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే.. అది ప్రభుత్వ భూమి అని అక్కడ అర్బన హెల్త్‌ సెంటర్‌ అప్రూవల్‌ అయిందంటూ తహశీల్దార్‌ శివారెడ్డి బుధవారం ఎక్సకవేటర్‌తో వచ్చి ప్రహరీగోడ కూల్చే ప్రయత్నం చేశారు. గోడను కూల్చనివ్వమంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి సీఐలు సత్యబాబు, సత్యనారాయణ, నాగభూషణం, అశోక్‌రెడ్డితోపాటు ఆరుగురు ఎస్‌ఐలు సిబ్బంది చేరుకున్నారు. పునాదులు తొలగిస్తున్న ఎక్సకవేటర్‌ డ్రైవర్‌పై స్థానికులు రాళ్లు రువ్వారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు మానవతా సంస్థ వ్యవస్థాపకులు రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని అందరితో కలసి చర్చించారు. దక్షిణం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో 45 అడుగులు తీసుకుని హెల్త్‌ సెంటర్‌ నిర్మించేందుకు ఒప్పించి కొలతలు తీసి మార్కింగ్‌ ఇవ్వడంతో సమస్య సమసిపోయింది.

గుడి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్ర
గుడి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారని గుడి చైర్మన, వైస్‌చైర్మన, కోశాధికారి, కమిటీ సభ్యులు శేషారెడ్డి, లోకేశ్వరరెడ్డి, సహదేవయ్య, చెన్నారెడ్డి, గోపాల్‌రెడ్డి, కేశవులు ఆరోపించారు. ప్రభుత్వం హిందూ దేవాలయ ఆస్తులను అమ్ముతూ నూతన గుడి నిర్మాణాలను అడ్డుకుంటోందని ఆరోపించారు. గుడి స్థలం విషయమై కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - 2021-06-24T06:05:23+05:30 IST