ఆర్టీసీ బస్సులో భక్తుల మధ్య తోపులాట

ABN , First Publish Date - 2022-05-28T06:02:58+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన రెండు కుటుంబాల మధ్య ఆర్టీసీ బస్సులో జరిగిన తోపులాట ఘర్షణకు దారితీసింది.

ఆర్టీసీ బస్సులో భక్తుల మధ్య తోపులాట
కొండపై ఘర్షణకు దిగిన ఇరుకుటుంబాల సభ్యులు

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

 యాదగిరిగుట్ట కొండపై ఘటన 

యాదగిరిగుట్ట, మే 27: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన రెండు కుటుంబాల మధ్య ఆర్టీసీ బస్సులో జరిగిన తోపులాట ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు సికింద్రాబాద్‌కు చెందిన ఓ కుటుంబం, హైదరాబాద్‌కు చెందిన మరో కుటుంబం యాదగిరిగుట్టకు వచ్చాయి. శుక్రవారం కొండకింద కల్యాణకట్ట నుంచి కొండపైకి భక్తులతో వెళుతున్న బస్సు సర్వీసులో రద్దీ అధికంగా ఉండడంతో ఫుట్‌బోర్డుపైన కూడా భక్తులు నిలబడి ఉన్నారు. అయితే కొండపైకి వెళుతున్న క్రమంలో బస్సు ఒక్కసారిగా తోపులాటకు గురైంది. దీంతో హైదరాబాద్‌కు చెందిన కుటుంబ సభ్యుల్లోని ఓ యువకుడు పక్కనే ఉన్న సికింద్రాబాద్‌ కుటుంబానికి చెందిన యువతిని తగిలాడు. సదరు యువతి యువకుడితో ఘర్షణకు దిగింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరగడంతో ఘర్షణకు దారితీసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తోటి ప్రయాణికులు ఇరు కుటుంబాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా గొడవ తీవ్రరూపం దాల్చుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

Updated Date - 2022-05-28T06:02:58+05:30 IST