అక్రమార్జనకు అడ్డదారులు

ABN , First Publish Date - 2022-06-30T07:17:40+05:30 IST

క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో అరాచకాలకు, అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు అసాంఘిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు.

అక్రమార్జనకు అడ్డదారులు

తిరుపతి (నేరవిభాగం), జూన్‌ 29 :  క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో  అరాచకాలకు, అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు అసాంఘిక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు.సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాల్సిన వారే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు.అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కడంతో పాటు హంతకులతో సైతం చేతులు కలిపి హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరించడం,భూములను ఆక్రమించడం, వరకట్న వేధింపులు... ఇలా ఏదో ఒక నేరానికి పాల్పడుతూ పోలీసు శాఖపై ప్రజలకు నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. 


కొన్ని ఉదాహరణలను పరిశీలిస్తే.....

తిరుపతి రూరల్‌ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో ఓ భవనాన్ని ఖాళీ చేయించడంతో పాటు ఆ భవనంలోని దాదాపు రూ.20లక్షల విలువైన సిగరెట్‌ ప్యాకెట్లను అమ్ముకుని వచ్చిన నగదును పంచుకున్న కేసుకు సంబంధించి అవినీతికి పాల్పడిన అప్పటి తిరుచానూరు ఇంచార్జి సీఐ, ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో డీసీఆర్బీలో డీటీఆర్బీ విభాగం సీఐగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, తిరుచానూరు ఎస్‌ఐలు ఎం. రామకృష్ణ, వీరేష్‌, బి. రామకృష్ణారెడ్డి బుధవారం సస్పెండయ్యారు.


రామచంద్రాపురం మండలంలో మార్చి 6న కుటుంబ కలహాలతో హేమసుందరం అనే వ్యక్తిని అతడి తండ్రి, సోదరుడే మరో వ్యక్తి సాయంతో హత్య చేశారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి కేసు నమోదు చేసిన సీఐతోపాటు ఎస్‌ఐని, ఒక కానిస్టేబుల్‌ను మూడు నెలల కిందట  ఐజీ వెంకట్రామరెడ్డి సస్పెండ్‌ చేశారు.


వరకట్నం కోసం తనను చిత్ర హింసలకు గురి చేయడంతో పాటు రూ. 12 లక్షల  కట్నం తీసుకురాకుంటే పిస్టల్‌తో కాల్చి చంపుతానని బెదిరిస్తున్నాడని కురబలకోట మండలం ముదివేడు ఎస్‌ఐ భార్య గత నెలలో భర్తపై మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై గత నెలలో మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.


కాలువ పొరంబోకు భూమిని ఆక్రమించి కోళ్ల షెడ్డు నడపడంతో పాటు ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడిన చంద్రగిరి ఎస్‌ఐపై కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.



అధికారం వీరిది పెత్తనం వారిది

పోలీసు శాఖపై రాజకీయ పెత్తనం కూడా మీతిమీరింది. కానిస్టేబుల్‌ మొదలుకొని ఉన్నతాధికారుల వరకు పోస్టింగులు, బదిలీలు నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.డబ్బులు కట్టి నేతల దీవెనలతో అనుకున్న స్టేషన్‌కు వెళ్లగానే ప్రజాసేవను విస్మరించి పోస్టింగ్‌ ఇప్పించిన నేతకు విధేయులుగా పనిచేస్తున్న పరిస్థితి చాలాచోట్ల కొనసాగుతోంది. కేసుల దర్యాప్తుపై రాజకీయ జోక్యం ఎక్కువవడంతో శాంతి భద్రతలపైన ఆ ప్రభావం పడుతోంది.బాధితులు, నిందితులు అనే తేడా లేకుండా పై నుంచి నేతలు చెప్పిన వారిపైనే చెప్పిన విధంగానే అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయి. బాధితులు స్టేషను గడప తొక్కేలోపు నిందితులు నేతల గడప తొక్కుతున్నారు. దీంతో వారి నుంచి క్షణాల్లో అందే ఆదేశాలను బట్టి కేసులు తారుమారవుతున్నట్లు విమర్శలున్నాయి.ఇలాంటి ఘటనలు మితిమీరిన సమయంలో నేతల అండదండలు చూసుకొని వారి ఆదేశాలతో కేసులు నమోదు చేసిన పోలీసులు చివరకు కటకటాలపాలవుతున్నారు.రాజకీయ నేతల చదరంగంలో కొందరు పోలీసులు సమిధలవుతుంటే మరికొందరు అక్రమార్జనకు అలవాటు పడి ఉద్యోగాలను కోల్పోతున్నారు.


హక్కులను కాలరాస్తున్నారు 

ప్రజల ధన.. మాన.. ప్రాణాలతోపాటు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన పోలీసులే హక్కులను కాలరాస్తున్నారు. ఫలితంగా పోలీసులంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.సామాన్యుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు పోలీసులపై ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి.నేరగాళ్ల ఆట కట్టించడమేకాక ప్రజలకు నిరంతరం చేయూతనివ్వాల్సిన కొందరు పోలీసులు అవినీతే పరమావధిగా విధులు నిర్వహిస్తున్నారు.పోలీసు శాఖలో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో గౌరవభావాన్ని పెంచేందుకు ఉన్నతాధికారులు కృషి చేస్తున్నా కొందరు సిబ్బంది నిర్వాకంతో అవన్నీ తలకిందులవుతున్నాయి. 


ఆదాయ వనరుగా స్టేషన్‌ బెయిల్‌

కొందరు అవినీతి పోలీసు అధికారులు కేసులను కాసులుగా మార్చుకుంటున్నారు.ప్రధానంగా స్టేషన్‌ బెయిల్‌ వ్యవహారాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. తీవ్రమైన నేరాల్లో నిందితులను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. గొలుసు దుకాణాలు, ఇసుక అక్రమ రవాణా, పేకాట, సారా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు లోపాయికారీగా అనుమతులిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారనే విమర్శలున్నాయి.

Updated Date - 2022-06-30T07:17:40+05:30 IST