కొడాలి కోతలు!

ABN , First Publish Date - 2022-01-22T08:45:26+05:30 IST

‘నా రెండున్నర ఎకరాల కల్యాణ మండపంలో కేసినో, జూదం నిర్వహించినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా! పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా!’...

కొడాలి కోతలు!

‘కేసినో’పై అడ్డగోలు బుకాయింపు

తన కన్వెన్షన్‌లో జరగనే లేదట

నిరూపిస్తే రాజీనామా చేస్తారట

ఆత్మాహుతి చేసుకుంటానని సవాల్‌

కె-కన్వెన్షన్‌ వేదికగానే జూద క్రీడ

లోపల వైసీపీ వర్ణాలతో అలంకారాలు

స్పష్టంగా ఆధారాలు, వీడియోలు

అయినా... మంత్రి నోట సవాళ్లు


(విజయవాడ - ఆంధ్రజ్యోతి): ‘నా రెండున్నర ఎకరాల కల్యాణ మండపంలో కేసినో, జూదం నిర్వహించినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా! పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా!’... ఇదీ రాష్ట్ర మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విసిరిన సవాల్‌! ఇది విని... రాష్ట్ర ప్రజలంతా విస్తుపోయారు. గుడివాడ వాసులేమో ‘వామ్మో... మా మంత్రి నోట ఇంత పచ్చి అబద్ధమా!?’ అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే... సంక్రాంతి సంబరాల పేరిట గుడివాడలో ‘గోవా కేసినో’లను దించడం నిజం. అందుకు మంత్రికి చెందిన కె-కన్వెన్షన్‌ హాలు వేదిక కావడం నిజం! దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేసినో స్వాగత తోరణాల వద్ద కె-కన్వెన్షన్‌ ఆర్చి స్పష్టంగా కనిపిస్తోంది. అంతదాకా ఎందుకు... కన్వెన్షన్‌ బయట పెద్ద స్ర్కీన్‌ పెట్టి మరీ లోపల జరుగుతున్న ‘సంబరాల’ను ప్రసారం చేశారు. అయినా సరే... ‘నిరూపిస్తే రాజీనామా చేస్తా. పెట్రోలు పోల్చుకుని కాల్చుకుంటా’ అని మంత్రి సవాల్‌ విసరడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 


ఇలా మొదలైంది... 

మూడు రోజుల సంక్రాంతి పండగలో తొలిరోజైన భోగి... అంటే ఈనెల 14వ తేదీన కేసినో నిర్వహణకు తెర లేపారు. కనుమ ముగిసిన తర్వాత... 17వ తేదీ తెల్లవారుజాము వరకు ఇది కొనసాగింది. కె-కన్వెన్షన్‌ ప్రవేశ ద్వారాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. నిజమైన సంప్రదాయ క్రీడలు, సంబరాలు మాత్రమే జరుగుతున్నాయనేలా అక్కడ హరిదాసులనూ నిలబెట్టారు. కన్వెన్షన్‌ హాలులోకి ప్రవేశించిన తర్వాత అసలు చిత్రం కనిపించింది. ‘ఎంట్రీ ఫీజు’ కట్టి లోపలికి వెళ్లిన వారు...  గోవాలో ఉన్నామా లేక గుడివాడలో ఉన్నామా అనే అయోమయంలో పడిపోయారు. పోకర్‌, అమెరికన్‌ రౌలెట్‌, తీన్‌పత్తి, అందర్‌ బాహర్‌, బ్లాక్‌ జాక్‌.. 7అప్‌ 7 డౌన్‌.. ఇలా గోవా కేసినోల్లో కనిపించే జూద క్రీడలన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. లోపల అంతా వైసీపీ పతాక వర్ణాలతోనే అలంకరణలు చేశారు. పనిలో పనిగా మంత్రి కొడాలి నానిని కీర్తిస్తూ డీజే పాటలు వినిపించారు. మంత్రికి అత్యంత సన్నిహితులుగా పేరున్న నందివాడ మండల ఎంపీపీ పెయ్యల ఆదాం, గుడివాడ రూరల్‌ మండలం వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్‌ విక్టర్‌ కేసినో సెట్టింగ్‌లో ఆ పాటలకు చిందేశారు. ఆ మూడురోజులు అక్కడ జరుగుతున్న తతంగం గుడివాడలో అందరికీ తెలుసు. బౌన్సర్లను పెట్టి, సెల్‌ ఫోన్లు తీసేసుకున్నా... లోపలి దృశ్యాలు బయటికి వచ్చాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కేసినో క్రీడలకు కె-కన్వెన్షన్‌ వేదిక అయినట్లు ఇన్ని ఆధారాలున్నప్పటికీ... ‘నిరూపిస్తే’ అంటూ మంత్రి సవాల్‌ విసరడం విశేషం.


ఏమీ లేదంటూనే డీఎస్పీకి ఫోన్‌!

తన కన్వెన్షన్‌లో కేసినో కానీ, అశ్లీల నృత్యాలు కానీ జరగలేదంటూనే... ఏవో నృత్యాలు జరుగుతున్నాయని సమాచారం రాగానే తానే డీఎస్పీకి ఫోన్‌ చేసి వాటిని ఆపించానని మంత్రి నాని చెప్పడం గమనార్హం. పైగా అన్నిచోట్లా జరిగినట్లే తన కన్వెన్షన్‌లోనూ సంక్రాంతికి సంప్రదాయబద్ధంగా జరిగే కోడి పందేలే జరిగాయని నాని పేర్కొన్నారు. ఈ మాట నిజమే. ఇది రెండున్నర ఎకరాల ప్రాంగణం. హాలులో కేసినో పెట్టారు. ఆరుబయట కోడి పందేలు కట్టారు. ఇక... కరోనా బారినపడిన తాను జనవరి 6 నుంచి గుడివాడలో లేనని, తాను లేనప్పుడు ఎక్కడో జరిగిన వీడియోలు తీసుకొచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కొవిడ్‌ బారిన పడటం, ఈనెల 6 నుంచి గుడివాడలో లేకపోవడం నిజమే! కానీ... ఆయన కన్వెన్షన్‌ సెంటర్‌లో జూద క్రీడలు జరగడం మాత్రం నిజం. ‘కన్వెన్షన్‌ హాలును ఎవరో అద్దెకు తీసుకుని కేసినోలు నడిపితే నాకేం సంబంధం. ఆ టైమ్‌లో నేను గుడివాడలోనే లేను’ అని మంత్రి దబాయిస్తారని ముందు నుంచీ అంతా ఊహించారు. కానీ... అందుకు భిన్నంగా, ‘నా కన్వెన్షన్‌ హాలులో కేసినో పెట్టారని నిరూపిస్తే.....’ అని సవాలు విసురుతారని మాత్రం ఎవరూ ఊహించలేదు! ఎందుకంటే... ‘తప్పు చేసినా సరే... కొడాలి నాని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు’ అని స్థానికులు భావిస్తారు. ఎందుకంటే... 2020 డిసెంబరులో నాని అనుచరులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంటు పోలీసులు దాడి చేశారు. అప్పుడు కొడాలి నాని ‘పేకాట ఆడలేదు. ఆడించలేదు’ అని చెప్పలేదు. ‘‘పేకాట ఆడితే తప్పేంటి. మహా అయితే ఫైన్‌ వేస్తారు.  ఉరితీయరుగా’’ అంటూ తనదైన శైలిలో ఎదురుదాడి చేశారు. 


2 లీటర్ల పెట్రోల్‌ పంపండి: బీటెక్‌ రవి

గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారో లేదో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెలుసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్‌ రెడ్డి (బీటెక్‌ రవి) సూచించారు. ఒకవేళ కేసినో తరహా జూదం జరిగిందని తేలితే, మంత్రి కొడాలి నానికి రెండు లీటర్ల పెట్రోల్‌ పంపంపిచాలని ట్వీట్‌ చేశారు. 


నాడు చిందులేసిన వారే నేడు దాడి చేసింది

కె-కన్వెన్షన్‌లో నిర్వహించిన కేసినోలో నానిని కీర్తించే పాటకు చిందులేసిన జాన్‌ విక్టర్‌ శుక్రవారం టీడీపీ కార్యాలయంపైన, టీడీపీ నాయకుల కార్లపైన జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించారు. ఆయనతోపాటు వైసీపీ నాయకుడు సర్దార్‌ బేగ్‌ కూడా దాడిలో పాల్గొన్నారు. దాడిలో పాల్గొన్న వారిలో కీలకమైన వ్యక్తి మంత్రి  కొడాలి నాని ముఖ్య అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్‌. ఈయన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ప్రస్తుతం మంత్రి ఓఎ్‌సడీగా కూడా పనిచేస్తున్నారు. ఎప్పుడూ తెరపై కనిపించరు. సుదీర్ఘకాలం తర్వాత తొలిసారి ఈయన రంగంలోకి దిగి టీడీపీ కార్యాలయంపై దాడికి నేతృత్వం వహించారు. శుక్రవారం టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వస్తున్నట్లు తెలుసుకుని... గురువారమే శశిభూషణ్‌ అప్రమత్తమయ్యారు. వ్యూహాత్మకంగా... శుక్రవారం కె-కన్వెన్షన్‌లో గుడివాడ నియోజకవర్గ ఎస్సీ సెల్‌ సమావేశం పేరుతో సుమారు 2వేల మందిని తీసుకొచ్చారు. వచ్చిన వారిని నాలుగు బృందాలుగా విభజించి... పట్టణంలోకి పంపించారు.

Updated Date - 2022-01-22T08:45:26+05:30 IST