సరిహద్దు దాటబోయి...పోలీసులకు చిక్కి!

ABN , First Publish Date - 2021-07-23T05:25:47+05:30 IST

గంజాయి రవాణాదారుల ఎత్తులను పోలీసులు చిత్తు చేస్తున్నారు. కొత్త మార్గంలో గంజాయిని తరలించేందుకు చేసిన ప్రయత్నాలను మరోసారి చాకచక్యంగా ఛేదించారు. 561 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

సరిహద్దు దాటబోయి...పోలీసులకు చిక్కి!
స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లతో డీఎస్పీ సుభాష్‌, సీఐ, ఎస్‌ఐలు

561 కిలోల గంజాయి స్వాధీనం

సరుకు విలువ రూ.5.6 లక్షలు

పాచిపెంట, జూలై 22: గంజాయి రవాణాదారుల ఎత్తులను పోలీసులు చిత్తు చేస్తున్నారు. కొత్త మార్గంలో గంజాయిని తరలించేందుకు చేసిన ప్రయత్నాలను మరోసారి చాకచక్యంగా ఛేదించారు. 561 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.5.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా మీదుగా బీహార్‌కు గంజాయి తరలుతోందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న పాచిపెంట పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి తనిఖీలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే పి.కోనవలస చెక్‌పోస్టుతో పాటు కోడికాళ్లవలస జంక్షన్‌ వద్ద కూడా కాపు కాశారు. వారు అనుమానించినట్టే కోడికాళ్లవలస జంక్షన్‌లో బుధవారం రాత్రి ఓ వ్యాన్‌ అనుమానాస్పదంగా రావడంతో అడ్డగించారు.  అందులో 561 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. విశాఖ జిల్లా జి.మాడుగుల నుంచి 109 గంజాయి ప్యాకెట్లను పార్సిల్‌ వ్యాన్‌లో బీహార్‌ తరలిస్తున్నారు. బీహార్‌కు చెందిన విశాల్‌కుమార్‌, ఓ బాలుడు వ్యాన్‌లో ఉన్నారు. వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ ఎ.సుభాష్‌ తెలిపారు. మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద పోలీసు తనిఖీలు ముమ్మరం కావడంతో గంజాయి రవాణాదారులు వేరే మార్గాలు వెతుకుతున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో సాలూరు సీఐ ఎల్‌.అప్పలనాయుడు, ఎస్‌ఐ ఎం.వెంకటరమణ ఉన్నారు.



Updated Date - 2021-07-23T05:25:47+05:30 IST