‘క్రాస్‌చెక్‌’... ఎంతో మేలు!

ABN , First Publish Date - 2020-02-16T06:38:04+05:30 IST

వేగంగా సాగే ప్రయాణంలో దారిలోని గతుకులేవీ పెద్దగా కనిపించవు. అదే దారిలో రెండోసారి వెళ్లినప్పుడు మాత్రం ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ‘కొన్ని విషయాల్లో వెనక్కి తిరిగి చూసుకోవడం చాలా అవసరం’ అంటుంటారు. అదేవిధంగా పరీక్షలు రాసే పిల్లలు రాసిన సమాధానాల్ని ఒకసారి క్రాస్‌ చెక్‌ చేసుకుంటే మంచిది

‘క్రాస్‌చెక్‌’... ఎంతో మేలు!

వేగంగా సాగే ప్రయాణంలో దారిలోని గతుకులేవీ పెద్దగా కనిపించవు. అదే దారిలో రెండోసారి వెళ్లినప్పుడు మాత్రం ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలుస్తాయి. అందుకే ‘కొన్ని విషయాల్లో వెనక్కి తిరిగి చూసుకోవడం చాలా అవసరం’ అంటుంటారు. అదేవిధంగా పరీక్షలు రాసే పిల్లలు రాసిన సమాధానాల్ని ఒకసారి క్రాస్‌ చెక్‌ చేసుకుంటే మంచిది. లేదంటే, అక్కడో తప్పు ఇక్కడో తప్పు దొర్లిపోయి మార్కులు తగ్గే అవకాశం ఉంది. ఎంత బాగా చదివిన పిల్లలైనా, ప్రశ్నపత్రం చూడగానే వేగంగా జవాబులు రాసుకుపోయే క్రమంలో చాలా తప్పులే దొర్లుతాయి. భావమే ప్రధానంగా రాసే వేగంలో అక్షరదోషాలు దొర్లడం సహజం. జవాబుల్లో ఎంత విషయం ఉన్నా, అక్షర దోషాలు మూల్యంకనం చేసేవాళ్లను ఇబ్బంది పెడతాయి. ఫలితంగా ఎంత కష్టపడి రాశానని అనుకున్న మార్కులు మాత్రం పడవు. తప్పులు అంటే మరీ అంత పెద్ద తప్పులే కానవసరం లేదు. చిన్న చిన్న అక్షర దోషాలు కూడా మొత్తం అర్థాన్నే మార్చేస్తాయి. కొన్నిసార్లయితే ఒక ప్రశ్నకు రాయాల్సిన విషయం మరో ఆన్సర్‌లోకి వచ్చి వాలిపోతుంది. 


కొంతమంది పిల్లలేమో నాలుగు ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉన్నా మూడింటికే రాసి ‘అన్నీ రాసేశాం’ అనుకుంటారు. ఇది మరీ నష్టదాయకం. అందువల్ల సమాధానాలన్నీ రాసిన తర్వాత మొత్తంగా ఒకసారి వాటిని రీ చెక్‌ చేసుకోవడం మేలు. దానివల్ల తొలివిడతలో దొర్లిన తప్పులు మలివిడతలో దొరికిపోతాయి. అయితే ‘ఆన్సర్లన్నీ  రాయడానికే టైమ్‌ సరిపోదు. ఇక క్రాస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా సాధ్యం?’ అన్న ప్రశ్న తలెత్తుతుంది. అలాంటప్పుడు పరీక్షల్లో 15 నిమిషాల ముందే ఆన్సర్స్‌ రాయడం పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ ప్రణాళికను అమలు చేసే తొలి ప్రయత్నం కొంత కష్టమే అనిపించవచ్చు. కానీ, ఆ తర్వాత అదే అలవాటవుతుంది. ఒక్కో ప్రశ్నకు 5 నిమిషాల చొప్పున సమయాన్ని మిగుల్చుకోగలిగితే 15 నిమిషాలు సులభంగా మిగులుతాయి. అయితే కొంత ముందు నుంచే సాధన చేస్తే, వార్షిక పరీక్షల నాటికి ఆ విద్య బాగానే అబ్బుతుంది. ఎంత కష్టపడి చదివారు... పరీక్షల్లో ఎంత వేగంగా రాసారన్నదే కాదుగా! తప్పులు లేకుండా ఎంత చక్కగా రాసారన్నది కూడా ముఖ్యం! నిజానికి ఈ క్రాస్‌ చెక్‌ చేసుకోవడం వల్ల చదవడంలో పడ్డ కష్టానికి తగ్గ మార్కులు లభిస్తాయి. పైగా ఈ ధోరణితో మునుముందు జీవితంలో కూడా ఎక్కువ తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడగలుగుతారు. అందుకే బాల్యం నుంచే క్రాస్‌చెక్‌ను పిల్లలకు నేర్పించడం తల్లిదండ్రులు ఒక పనిగా పెట్టుకోవాలి.

Updated Date - 2020-02-16T06:38:04+05:30 IST