గ్రామాల్లోనే పంటలు విక్రయించాలి

ABN , First Publish Date - 2020-03-30T11:35:10+05:30 IST

రబీలో పండించిన పంటల కొనుగోళ్ల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లోనే పంటలు విక్రయించాలి

 జిల్లాలో 211 కొనుగోలు కేంద్రాలు

73 మొక్కజొన్న, 9 శనగ,  9 వేరుశనగ కేంద్రాలు

జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ 


వికారాబాద్‌: రబీలో పండించిన పంటల కొనుగోళ్ల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. రబీ పంటల కొనుగోళ్లపై ఆయన ఆదివారం తన ఛాంబర్‌లో వ్యవసాయ, మార్కెటింగ్‌ తదితర శాఖల అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు తాము పండించిన పంటలను మార్కెట్‌కు తరలించకుండా గ్రామాల్లోనే కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో 324 గ్రామాల్లో వరి సాగు చేయగా, ఈ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఐకేపీల ఆధ్వర్యంలో 211 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు 73, శనగల కోసం 9, వేరుశనగ కొనుగోలుకు 9 కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.


5 వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ పంట దిగుబడి వచ్చే గ్రామాల్లో 211 పర్మినెంట్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆ కేంద్రాల ఆధ్వర్యంలోనే మిగిలిన 123 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పారు. ఈ గ్రామాల్లో ఏ రోజు ఏ రైతు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారనేది ముందుగానే తెలియజేసి టోకెన్లు జారీ చేస్తారని, ఆలోగా రైతులు తమ ధాన్యాన్ని పొలంలోనే బాగా ఎండబెట్టి చెత్త చెదారం లేకుండా సూచించిన రోజు కేంద్రాలకు తీసుకు వస్తే కొనుగోలు చేస్తారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యం మాత్రమే తీసుకు రావాలని, ఆరబెట్టకుండా ధాన్యం తీసుకువస్తే మాత్రం వెనక్కి తిరిగి పంపిస్తారన్నారు. కొనుగోలు చేసే ధాన్యాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిల్వ ఉంచుతామని, రెండు రోజులకోసారి లారీల్లో ఆ ధాన్యం నింపి పంపించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రైతులు తాము పండించిన పంటలను అమ్మడానికి మార్కెట్లకు రాకుండా ఉన్న గ్రామాల్లోనే విక్రయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులు తమ ధాన్యాన్ని గ్రామాల్లోనే విక్రయించుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో కృష్ణన్‌, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, జిల్లా సహకార అధికారి లక్ష్మినారాయణ,  మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి సబిత, మార్క్‌ఫెడ్‌, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T11:35:10+05:30 IST