Abn logo
Mar 27 2020 @ 03:08AM

పంటకొచ్చిన తంటా!

కరోనా తెచ్చిన కష్టం... ఇంటి నుంచి బయటి రాలేకపోవడం! దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. మరీ ముఖ్యంగా... ఆరుగాలం కష్టించి, పండించిన పంటలను కాపాడుకోలేని పరిస్థితి. ఇది కల్లాల్లో ఆరబోసిన మిర్చిని కోల్డ్‌స్టోరేజీలకు తరలించాల్సిన సమయం. ఆ పని ఆగిపోయింది. చివరి విడతగా తీయాల్సిన పత్తీ పొలాల్లో ఉంది. మినుము, పెసర, కంది, జొన్న, మొక్కజొన్న, శనగ, వేరుశనగ పంటలూ కోతకు  వచ్చాయి. వరి కోతలకు సమయం ఉన్నా, తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేయాల్సి ఉంది. మొక్కజొన్నపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. పౌల్ర్టీ పరిశ్రమ మూతపడడంతో మొక్కజొన్న ధరలు పతనమయ్యాయి. 


  • 25  శాతం మిర్చి కల్లాల్లోనే
  • చివరి విడత పత్తీ పొలంలోనే
  • ఇతర రబీ పంటలదీ అదే దైన్యం
  • కూలీలులేక తరలించలేని వైనం

(అమరావతి - ఆంధ్రజ్యోతి) : సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ రైతులు, వ్యవసాయ కూలీలు ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా కూలీలు రాని పరిస్థితులున్నాయి. ఎండిన మిర్చిని బస్తాలను ఎత్తడంతో పాటు వాటిని కోల్డ్‌ స్టోరేజీలకు తరలించాలంటే.. రవాణాపై ఆంక్షలు ఇబ్బందికరంగా ఉంటున్నాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల హెక్టార్లలో మిర్చి వేయగా, 75ు పంట  మార్కెట్‌కు లేదా కోల్డ్‌ స్టోరేజీలకు వెళ్లింది. ఇంకా 25 శాతం పంట కల్లాల్లోనే ఉంది. దీనిని సకాలంలో ఇళ్లకో, మార్కెట్‌కో, గోదాములకో చేర్చకపోతే... అకాల వర్షాలు కురిస్తే పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా.. రవాణా సమస్యలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 


ఉద్యాన పంటల గోడు...

లాక్‌డౌన్‌ వల్ల అరటి, మామిడి, నిమ్మ, ఇతర పండ్లు, తమలపాకుల ఎగుమతులు సాగడం లేదని ఉద్యాన రైతులు వాపోతున్నారు. తమలపాకులు కోసి వాడకపోతే, పనికి రాకుండా పోతాయి. దుకాణాల మూత వల్ల తమలపాకు రవాణా నిలిచిపోయింది. రాష్ట్రాల సరిహద్దులను మూసేయడంతో రవాణాలేక ఉత్పత్తులు పాడైపోతున్నాయి. దీనివల్ల .కోట్లలో నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు లాక్‌డౌన్‌ విరామ సమయంలో ద్విచక్ర వాహనాలపై పండ్లను స్థానికంగా అమ్ముకుంటున్నారు. పట్టణాలకు తరలించడానికి ప్రజారవాణా వ్యవస్థ లేకపోవడంతో సొంత వాహనాలు లేని వారు ఇబ్బంది పడుతున్నారు.  వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవరోధం కల్పించొద్దని ఉన్నతాధికారులు చెప్తున్నా... అనేకచోట్ల పోలీసు సిబ్బంది అడ్డుపడుతున్నారు.  


కల్తీ పాల ప్రమాదం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం కొందరు ప్యాకెట్‌ పాలు కొనడానికి ఇష్టపడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా పాల కేంద్రాలకు పశుపోషకులు తెచ్చి పోసే విడి పాలపైనే మక్కువ చూపుతున్నారు. దీన్ని ఆసరా చేసుకుని ప్రజల అవసరాలకు సొమ్ము చేసుకునేందుకు కొన్ని చోట్ల పిండి కలిపిన కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు సమాచారం. పాల డిమాండ్‌, ఆంక్షల నేపథ్యంలో తీయాల్సిన సమయంకంటే ముందే తీయడం వల్ల పాలు విరిగిపోతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. సాధారణంగా ఉదయం 5 నుంచి 7గంటల లోపు, సాయంత్రం 4.30 నుంచి 6.30గంటల లోపు గేదెల నుంచి పాలు తీయాల్సి ఉంటుంది. కానీ... తెల్లవారుజామున 3గంటలకు, మధ్యాహ్నం 3గంటలకే పాలు తీసుకొస్తుండడంతో పాలు కాగబెడితే విరిగిపోతున్నాయని అనేక చోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement