1,844.716 హెక్టార్లలో పంట నష్టం

ABN , First Publish Date - 2021-10-20T06:35:15+05:30 IST

గత నెలలో సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో 1,844.716 హెక్టార్లలో ఎనిమిది రకాల పంటలు దెబ్బతిన్నాయని, వీటికి సంబంధించి 6,905 మంది రైతులు రూ.2.75 కోట్లు నష్టపోయారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.

1,844.716 హెక్టార్లలో పంట నష్టం

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంపై వ్యవసాయ అధికారుల నివేదిక

అత్యధికంగా 1,827.88 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు గుర్తింపు

6,905 మంది రైతులకు రూ.2.75 కోట్లు మేర

83.2 హెక్టార్లలో ఉద్యానవన పంటలు...


విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గత నెలలో సంభవించిన గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో 1,844.716 హెక్టార్లలో ఎనిమిది రకాల పంటలు దెబ్బతిన్నాయని, వీటికి సంబంధించి 6,905 మంది రైతులు రూ.2.75 కోట్లు నష్టపోయారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా 1,827.88 హెక్టార్లల్లో వరి పంట దెబ్బతిన్నట్టు గుర్తించారు. తుఫాన్‌ సమయంలో కురిసిన కుంభవృష్టి వర్షాలతో జిల్లాలోని పలు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ వుండడంతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు. 28 మండలాల్లో 6,814 మంది రైతులకు చెందిన 1,827.88 హెక్టార్లల్లో వరి పంట దెబ్బతిన్నదని, దీనివల్ల ఆయా రైతులు రూ.2.74 కోట్లు నష్టపోయారని ప్రభుత్వానికి నివేదించారు. మూడు మండలాల్లో 30 మందికి చెందిన 4.158 హెక్టార్లలో చెరకు తోటలు పాడైపోవడంతో రూ.62 వేలు, రెండు మండలాల్లో 15 మంది రైతులకు చెందిన 3.968 హెక్టార్లలో మొక్కజొన్న పంట దెబ్బతినడంతో రూ.49.6 వేలు, 47 మంది రైతులకు చెందిన 9.2 హెక్టార్లలో పప్పుఽధాన్యాలు, చోడి, కంది, వేరుశనగ, రాజ్‌మా పంటలు దెబ్బతినడంతో రూ.60 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు నిర్ధారించారు. వరి, చెరకు, వేరుశనగ పంటలకు హెక్టారుకి రూ.15 వేలు, పప్పుధాన్యాలు, రాజ్‌మాకు రూ.10 వేలు, మొక్కజొన్నకు రూ.12,500, చోడి పంటకు రూ.6,800 చొప్పున నష్టపరిహారం అందించనున్నారు. జిల్లాలో పంట నష్టంపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్టు వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు. 


83.2 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం

తుఫాన్‌ కారణంగా 83.2 హెక్టార్లలో 779 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానవన శాఖ జేడీ గోపీకుమార్‌ తెలిపారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో పంటలు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. 450 మంది రైతులకు చెందిన 53.12 హెక్టార్లల్లో అరటి, 46 మంది రైతులకు చెందిన 6.4 హెక్టార్లలో బొప్పాయి, 158 మంది రైతులకు సంబంధించి 14.582 హెక్టార్లలో కూరగాయలు, 124 మంది రైతులకు సంబంధించి 9.088 హెక్టార్ల పూలతోటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అరటి పంటకు హెక్టారుకి రూ.25 వేలు, కూరగాయలు, బొప్పాయి, పూల తోటలకు హెక్టారుకి రూ.15 వేలు చొప్పున నష్టపరిహారం అందుతుందన్నారు.

Updated Date - 2021-10-20T06:35:15+05:30 IST