కడగండ్లు.. వర్షాలకు నష్టపోయి కుదేలైన రైతన్నలు

ABN , First Publish Date - 2020-11-11T19:21:28+05:30 IST

ప్రారంభంలో అన్నదాతల్లో ఆశలు రేపిన వానాకాలం.. పంట చేతికొచ్చే సమయంలో కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో రైతులకు అపార మైన నష్టం వాటిల్లింది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లాలోని 256 గ్రామాల్లో 20,897 మంది రైతులు సాగుచేసిన 44,328 ఎకరాల్లో పత్తి,

కడగండ్లు.. వర్షాలకు నష్టపోయి కుదేలైన రైతన్నలు

జిల్లాలో రూ. 200 కోట్లకు పైగానే పంట నష్టం

సాయం కోసం బాధిత రైతుల ఎదురుచూపులు


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): ప్రారంభంలో అన్నదాతల్లో ఆశలు రేపిన వానాకాలం.. పంట చేతికొచ్చే సమయంలో కుండపోతగా కురిసిన భారీ వర్షాలతో రైతులకు అపార మైన నష్టం వాటిల్లింది.  ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లాలోని 256 గ్రామాల్లో 20,897 మంది రైతులు సాగుచేసిన 44,328 ఎకరాల్లో పత్తి, కంది, పెసర తదితర పంటలు నీట మునిగి నష్టపోగా, అక్టోబరు 12 నుంచి 14వ తేదీ వరకు కురిసిన వర్షాలకు రైతులు సాగు చేసిన ప్రధాన పంటల్లో పత్తి, కంది, పెసర, వరి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. 54,663 మంది రైతులు సాగు చేసిన 98,899 ఎకరాల పత్తి, కంది, వరి పంటలకు  తీవ్ర నష్టం జరిగింది. వానాకాలం సీజన్‌లో జిల్లా సాగు విస్తీర్ణం 5,50,106.21 ఎకరాల్లో ఉండగా,  భారీ వర్షాలకు 1,43,227 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జిల్లాలో 86,998 ఎకరాల్లో పత్తి పంట వర్షార్పణమైంది. కంది పంట 33,142 ఎకరాలు, పెసర 13,701 ఎకరాలు, వరి 8,191 ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. మొక్కజొన్న 310, సోయా 300, అలసంద 280, మినుములు 109, చెరుకు 41 ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ సీజన్‌లో ఇంత వరకు జిల్లాలో కురిసిన వర్షాలకు 75560 మంది రైతులు 1,43,227 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. రూ.200 కోట్లకు పైగా పంట నష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 


ఆదుకోండి సారూ...

భారీవర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు తమను సహాయం ఆందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీమా చేసి ఉంటే  ప్రకృతి వైపరీత్యాలతో ఎలాంటి పంట నష్టం జరిగినా ఎంతో కొంత పరిహారం బాధిత రైతులకు అందేది. ఈ ఏడాది వానాకాలం నుంచి పంటల బీమాను నిలిపివేయడతో రైతులు ఏ పంటకు బీమా చేయించ లేకపోయారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన తమకు ప్రభుత్వం తగిన నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


నేడు బషీరాబాద్‌ మండలంలో రాష్ట్ర రుణ ఉపశమన సంఘం పర్యటన

జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రుణ ఉపశమన కమిషన్‌ పర్యటించి రైతులు నష్టపోయిన పత్తి, కంది, వరి, కూరగాయలు తదితర పంటలను పరిశీలించనుంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కమిషన్‌ చైర్మన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు బషీరాబాద్‌ మండలంలోని జీవన్గి, ఎక్మయి గ్రామాల్లో పర్యటించి జరిగిన పంటనష్టం పరిశీలించిన అనంతరం బాధిత రైతుల సమావేశం కానున్నారు. జరిగిన పంట నష్టం, ఎదుర్కొంటున్న సమస్యల గురించి పేద రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. జిల్లాలో జరిగిన పంట నష్టం, ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రుణ ఉపశమన సంఘం ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

Updated Date - 2020-11-11T19:21:28+05:30 IST