అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలి

ABN , First Publish Date - 2022-07-01T05:35:28+05:30 IST

అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ 2022-23 వార్షిక రుణప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలి
వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ 


సిద్దిపేట అగ్రికల్చర్‌, జూన్‌ 30 : అర్హులైన రైతులందరికీ పంట రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ 2022-23 వార్షిక రుణప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. రూ.5,280.73 కోట్ల రుణ ప్రణాళికలో ముఖ్యంగా వ్యవసాయ రుణాల నిమిత్తం రూ.3818.11, పరిశ్రమలకు రూ.814.99, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.352.89 కోట్ల రుణాల లక్ష్యాన్ని నిర్ధారించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అర్హత గల రైతులకు రుణమాఫీ పథకంలో డబ్బు ప్రభుత్వం జమ చేస్తుందని, రైతులు పాత పంట రుణాలను పూర్తిగా చెల్లించి కొత్త రుణాలను తీసుకోవాలని తద్వారా పంట బీమా పొందవచ్చునని తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలను విరివిగా మంజూరు చేయించాలని బ్యాంకు అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతీ బ్యాంక్‌ అధికారులు, వ్యవసాయ అధికారుల సమన్వయంతో గ్రామాల్లో లోన్‌ మేళాను ఏర్పాటు చేసి పంట రుణాలను రెన్యూవల్‌ చేయాలని, కొత్త పంట రుణాలను మంజూరు చేయాలని సూచించారు. వ్యవసాయ పీఎన్‌ఎ్‌ఫఎంఈ రుణాల లక్ష్యాన్ని నిర్ధేశించామని, పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్‌  రుణాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు అర్హత కలిగిన సంఘానికి రూ.20 లక్షల రుణాలు మంజూరు చేయాలని సూచించారు. పీఎం స్వానిధి కింద మొదటి విడత రూ.10వేలు వడ్డీతో సహా చెల్లించి, రెండో విడత రూ.20 వేలు లీడ్‌ బ్యాంకు ద్వారా పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ డీడీఎం సీసీల్‌ తిమోతీ, యూనియన్‌ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ సత్యం పాలుగుల, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సత్యజిత్‌, ఇతర బ్యాంకు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T05:35:28+05:30 IST