పంట రుణాల లక్ష్యం రూ.2,400 కోట్లు...!

ABN , First Publish Date - 2022-06-23T05:03:16+05:30 IST

పంట రుణాల లక్ష్యం రూ.2,400 కోట్లు...!

పంట రుణాల లక్ష్యం రూ.2,400 కోట్లు...!


  • వానాకాలం రూ.1,400 కోట్లు.. యాసంగి రూ.1,000 కోట్లు
  • 2022-23 ఆర్థిక సంవత్సరం పంట రుణప్రణాళిక సిద్ధం 
  • ఎక్కువమంది రైతులకు రుణాలు పంపిణీ చేసేలా రూపకల్పన

వికారాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఈ ఏడాది జిల్లా రైతులకు పంపిణీ చేసే పంట రుణ ప్రణాళిక ఖరారైంది. గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువమంది రైతులకు పంట రుణాలు మంజూరు చేసేలా రుణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఈ వానాకాలంతో పాటు వచ్చే యాసంగిలో రైతులు పంటలు సాగు చేసేందుకు వీలుగా రుణ ప్రణాళిక తయారు చేసినట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.1,715 కోట్లతో పంట రుణ ప్రణాళిక రూపొందిస్తే.. ఈ ఏడాది 1.90లక్షల మంది రైతులకు రూ.2,400 కోట్ల పంట రుణాలు పంపిణీ చేసే విధంగా రుణ ప్రణాళిక రూపకల్పన చేసినట్లు తెలిసింది. వానాకాలంలో 1.14లక్షల మంది రైతులకు రూ.1,400 కోట్లు, యాసంగిలో 76వేల మంది రైతులకు రూ.1,000 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు సమాచారం. గత ఏడాది జిల్లాలో 1.60లక్షల మంది రైతులకు రూ.1,715 కోట్లు పంపిణీ చేయాలనే లక్ష్యం బ్యాంకర్లు నిర్దేశించుకోగా, దాంట్లో 1.20 లక్షల మంది రైతులకు రూ.1,280 కోట్ల మేర మాత్రమే పంట రుణాలు పంపిణీ చేయగలిగారు. వానాకాలంలో 80 వేల మంది రైతులకు రూ.800 కోట్లు, యాసంగిలో 40 వేల మంది రైతులకు రూ.480 కోట్ల మేర పంట రుణాలు పంపిణీ చేశారు. గత ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో 75 శాతం వరకే బ్యాంకర్లు పంట రుణాలు మంజూరు చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాలనే నిర్దేశించుకున్న లక్ష్యంలో ఎంత మేర బ్యాంకర్లు సఫలీకృతులయ్యారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

రుణాల కోసం రైతుల ఎదురుచూపులు

వర్షాలు కురియడంతో వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పంట పెట్టుబడుల కోసం వచ్చే రైతులతో బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. పంట రుణాల మంజూరులో ఇంకా వేగం పెరగకపోవడంతో రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. జిల్లా రుణ ప్రణాళిక ఆమోదం పొందిన తరువాతనే బ్యాంకర్లు లక్ష్యం మేరకు పంట రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు. పంట పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందజేసే రైతుబంధు డబ్బులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందజేసే రైతుబంధు డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తే పంటల సాగుకు ఎంతో సహాయకారిగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-06-23T05:03:16+05:30 IST