సార్వా సాగుకు స్వస్తి

ABN , First Publish Date - 2022-09-14T06:03:16+05:30 IST

భారీ వర్షాలు, వరదల కారణంగా రైతుల ఆశలు అడియాశలయ్యాయి.

సార్వా సాగుకు స్వస్తి
లక్ష్మణేశ్వరంలో ఊడ్చకుండా వదిలేసిన పంట పొలాలు

అకాల వర్షాలు, వరదలతో పంట విరామం

పూడుకుపోయిన మురుగునీటి డ్రెయిన్లు.. ముందుకు పారని నీరు

నరసాపురం మండలంలో  12 వేల ఎకరాల్లో రెండుసార్లు నాట్లు.. 

ముంపు బారిన పొలాలు

వెయ్యి ఎకరాల్లోనే సాగుకు సిద్ధం.. 

11 వేల ఎకరాలకు విరామం

ముందస్తు దాళ్వాకు సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు

సాగు చేయకపోయినా రైతుల 

నుంచి నీటి తీరువా వసూళ్లు.. 


నరసాపురం రూరల్‌, సెప్టెంబరు 13 : భారీ వర్షాలు, వరదల కారణంగా రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఎప్పుడూ ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసే వానలు, వరదలు ఈసారి రెండు నెలల ముందుగానే రావడంతో వేలకు వేలు పెట్టుబడిన పెట్టి చేపట్టిన సాగు ఈ సారి నష్టాలనే మిగిల్చింది. చేలల్లో నిలిచిన నీరు బయటకు వెళ్లకపోవడంతో వేసిన నారుమడులు కుళ్లిపోయాయి. మరోసారి కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో అక్కడ రైతులు సాగుకు స్వస్తి చెబుతున్నారు.


గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని వాపోతున్నారు. నరసాపురం మండలంలో 12 వేల వంద ఎకరాల్లో సార్వా సాగు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం వెయ్యి ఎకరాల్లోనే వరి పండిస్తున్నారు. మిగిలిన 11 వేల 100 ఎకరాలకు రైతులు సాగు విరామం ప్రకటించేశారు. ఈ ఏడాది జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. రెండుసార్లు వేసిన నారు కుళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి డ్రైనేజీల్లోని పూడిక పనులు చేపట్టకపోవడంతో చేలల్లోని నీరు బయటకు పోలేదు. రుస్తుంబాద, నత్తలావ, సరిపల్లి, జూన్నులు, దర్బరేవు, వేముల దీవి మురికి డ్రైనేజీలు అధ్వాన్నంగా మారాయి. దీంతో భారీ వర్షాల సమయంలో చేలల్లో నీరు నిలిస్తే బయటకు పోవడం లేదు. అనేకమార్లు రైతులు ఉద్యమాలు, అధికారులకు వినతి పత్రాలందించినా ప్రయోజనం లేకపోయింది.


రైతులపై పన్నుల బాదుడు

రైతులు సార్వాకు స్వస్తి చెప్పినా ప్రభుత్వం మాత్రం వదలడం లేదు. సాగు చేసినా.. చేయకపోయినా.. రైతుల నుంచి పన్నుల రూపంలో బాదేస్తోంది. వీరి నుంచి నీటి తీరువా వసూలు చేయాలని అధికారులు నిర్ణయించడంతో రెవెన్యూ, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మరీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కష్టకాలంలో రైతులకు ఆసరాగా ఉండటం మానేసి ఇలా వ్యవహరించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


దాళ్వాకు సిద్ధం కావాలి 

మరోవైపు సాగు చేయని రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు దాళ్వాకు సిద్ధం కావాలని చైతన్యపర్చే పనిలో పడ్డారు. అక్టోబరులో నారుమడులు వేసుకంటే జనవరి నాటికి పంట చేతికొస్తుందని అవగాహన కల్పిస్తున్నారు. 80 శాతం సబ్సిడీపై 1153 రకాల విత్తనాలను సిఫారసు చేస్తున్నారు. ఇటు పంట వేయలేని గ్రామాల్లో దాళ్వా వేసుకునేలా రైతులను వ్యవసాయ శాఖ చైతన్యపరుస్తోంది.  


ముందస్తు దాళ్వాపై అవగాహన

‘నరసాపురం మండలంలో వెయ్యి ఎకరాల్లోనే సార్వా పంట వేశారు. వర్షాలు, వరదల కారణంగా చాలా మంది రైతులు పంటకు స్వప్తి చెప్పారు. సీజన్‌ మధ్యలో ఉండటంతో ముందస్తు దాళ్వాకు సిద్ధం కావాలని రైతులకు తెలియజేస్తున్నాం. అక్టోబర్‌లో నారుమడులు వేస్తే జనవరి నాటికి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది’ అని వ్యవసాయ శాఖ ఏవో డాక్టర్‌ జాన్సన్‌ తెలిపారు. ‘డ్రెయిన్లలో పూడిక పనులు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం రైతులు ఇబ్బందులను గుర్తించి పూడికపోయిన రుస్తుంబాద డ్రెయిన్‌ పనులు రెండు కిలోమీటర్ల మేర చేప డుతున్నాం’ అని ఇరిగేషన్‌ ఏఈ మోహన్‌ కృష్ణ తెలిపారు.


డ్రెయిన్లను ఆధునికీకరించాలి

డ్రెయిన్లను ఆధునికీకరించ కపోతే అప్పులు తెచ్చి సాగు చేసిన పంటను ఏటా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. వర్షాలకు చేలల్లోని నీరు బయటకు పోవడం లేదు. ఈ కారణంగా పల్లపు ప్రాం తాలతోపాటు మెరక ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. గతంలో అనేకమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతులు ఇచ్చాం. 

వైఎస్‌ బాబులు, రైతు


పన్నులు  దారుణం

దర్భరేవు డ్రెయిన్‌ గుండా సుమారు మూడు వేల ఎకరాల వరకు సాగవుతోంది. డ్రెయిన్లను బాగు చేయకపోవడం వల్ల వంద లాది ఎకరాలు నీట మునిగాయి. మెరక ప్రాంతాల్లోను ఈ సారి ఏ రైతు సార్వా పంట వేయలేదు. అందరం క్రాఫ్‌ హాలిడే ప్రకటించాం. అయితే ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి  నీటితీరువా పన్నులు కట్టించుకోవడం దారుణం. 

కటకంశెట్టి పెద్దిరాజు



Updated Date - 2022-09-14T06:03:16+05:30 IST