అధిక తేమతో పంట నష్టం

ABN , First Publish Date - 2021-12-02T05:18:11+05:30 IST

ఎడతెరపిలేని వర్షాలతో పంటలకు తీవ్రంగా నష్టపోతున్నాయి.

అధిక తేమతో పంట నష్టం
శనగ పొలంలో నిల్వ ఉన్న నీరు

  1. మెలకువలు పాటించడమే పరిష్కారం  


నంద్యాల టౌన్‌, డిసెంబరు 1:  ఎడతెరపిలేని వర్షాలతో   పంటలకు తీవ్రంగా నష్టపోతున్నాయి. జిల్లాలో వరి, పత్తి, కంది, శనగ, జొన్న తదితర పంటలను రైతులు విస్తారంగా సాగు చేశారు. ఖరీ్‌ఫలో సాగు చేసిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు పూతదశలో ఉన్నాయి. రబీ సీజన్‌లో రైతులు సాగు చేసిన జొన్న పైరు పొట్టదశ, శనగ పైరు శాఖీయ దశలో ఉన్నాయి. ఆల్పపీడనం వల్ల రోజుల తరబడి వర్షాలు కురవడం,  ముసురు పట్టడంతో  పంటలకు ఇప్పటికే నష్టం వాటిల్లింది. రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే నష్టాన్ని నివారించుకోవచ్చని, అధిక దిగుబడిని పొందవచ్చని  నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు,  సీనియర్‌ శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు ఇలా సూచిస్తున్నారు. 


వరిలో : పొలం ముంపునకు గురైతే నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపాలి. పడిపోయిన వరి దుబ్బులను ఒక్కటిగా చేర్చి కట్టలు కట్టాలి. కోత దశలో ఉన్న వరిపైరుకు విత్తనాల రంగు మారకుండా, మొలకెత్తకుండా 5శాతం ఉప్పు ద్రావణాన్ని (50గ్రాములు/ లీటర్‌) నీటికి పిచికారి చేయాలి. అగ్గి తేగుళ్లు, పాము పొడ తెగులు నివారణ టైప్లాక్స్‌ స్ట్రోబిన్‌, టెబుకొనజోన్‌ 0.4గ్రాములు/లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 


పత్తిలో : పొలంలో ఉన్న మురుగునీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు పంపాలి. పత్తి మొక్కలు వడలిపోతున్నట్లు గమనించిన  వెం టనే కాపర్‌ యాక్సిఫ్ల్లోరైడ్‌ మందును ఒక లీటర్‌ నీటికి 3గ్రాముల మం దును కలిపి ద్రావణాన్ని మొక్కల మొదలు దగ్గర చల్లాలి. పత్తిని తేమలేని సమయాల్లో సేకరించాలి. గులాబీరంగు పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. 


మినుము, పెసరలో : పొలంలో నిల్వ ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపాలి. ఇనుప ధాతు లోప లక్షణాలు ఉన్నట్లయితే అన్నాభేది 5గ్రాములు, నిమ్మఉప్పు ఒకగ్రాము లీటర్‌ నీటికి కలిపి 7-10రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. 


జొన్నలో : మురుగునీటిని బయటకు పంపేలా చేయాలి. నత్రజని లోప లక్షణాలను జొన్న పంటలో గమనించినట్లయితే 13-0-45 లేదా 19-19-19అనే నీటిలో కరిగే ఎరువులను లీటర్‌ నీటిలో  10గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పై పాటుగా ఎకరానికి 35కేజీల యూరియాను అందించాలి. 


శనగలో : పొలంలో నిల్వ ఉన్న నీటిని త్వరగా బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలి. విత్తిన 10-15రోజుల తరువాత పొలంలో మొదలు కుళ్లు గమనించినప్పుడు ఎకరాకు 200గ్రాముల కార్పెండిజం, 600 గ్రాముల మాంకోజబ్‌ను వాడి మొక్కలు మొదలు భాగం తడిసేలా  పిచికారీ చేయాలి. 


Updated Date - 2021-12-02T05:18:11+05:30 IST