అకాలవర్షాలతో పంట నష్టం.. అందని పరిహారం

ABN , First Publish Date - 2022-05-15T05:58:02+05:30 IST

అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలబారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

అకాలవర్షాలతో పంట నష్టం.. అందని పరిహారం
నిజాంపేట మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరి(ఫైల్‌)

 పంట దెబ్బతింటే ఇక అంతే!

 అధికారుల సర్వేలతోనే సరి

 ఇన్‌పుట్‌ సబ్సిడీ అయినా ఇవ్వని ప్రభుత్వం 

 మూడేళ్లుగా ఇదే తంతు 

 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే 14: అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలబారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాధిత రైతాంగానికి పరిహారం కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. మెదక్‌ జిల్లాలో 2020 సంవత్సరం నుంచి పంట నష్టపోయిన రైతులకు ఎదురుచూపులే తప్ప పరిహారం అందడం లేదు. ఒక ఏడాది కాకుంటే మరో ఏడాదైనా పరిహారం రాకుండా పోతుందా అన్న ఆశతో ఉన్నారు. భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. లక్షలాది రూపాయల పెట్టు బడులు నీటి పాలయ్యాయి.


 మూడేళ్లుగా ఇదే తంతు..

జిల్లాలో వరుసగా మూడేళ్లుగా భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయి రైతాంగం సతమతమవుతూనే ఉంది. అటు వానా కాలం అతివృష్టి, ఇటు యాసంగి సీజన్‌లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. 2020 అక్టోబర్‌ నెలలో కురిసిన వానలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ అధికారుల లెక్కలు మాత్రం పంట నష్టాన్ని వందల ఎకరాలకు పరిమితం చేశారు. 2021లో కురిసిన భారీ వర్షాలకు కూడా జిల్లాలో పంట నష్టం తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట మరోసారి దెబ్బతిన్నది. 


 అమలు కాని ‘ఫసల్‌ భీమా యోజన’  

వరదలు, అకాల వర్షాలకు పంట నష్టం జరగడం పరిహారం అందక ఉసూరుమనడం రైతాంగానికి పరిపాటిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట నష్టం జరిగిన రైతాంగానికి ఎలాంటి సహాయం అందించడం లేదు. కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందించడం లేదు. గతంలో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది కానీ రైతుబంధు పథకం తీసుకువచ్చిన తరువాత ఫసల్‌ భీమా యోజన పథకం అమలు కావడం లేదు. ఈ పథకం అమలులో ఉంటే రైతాంగానికి కొంతైనా మేలు కలిగేది. రైతుబంధు పథకం అమలుతో మిగతా పథకాలు అమలు చేయడం లేదు. ఏడాదికి రెండు సార్లు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇస్తున్న పంట పెట్టుబడిలోనే అన్నీ చూసుకోవాలనేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని రైతాంగం వాపోతుంది. 


 2020 నుంచి పంట నష్టం వివరాలు 

జిల్లాలో 2020 సంవత్సంర నుంచి భారీ వర్షాలు, వడగళ్ల వానలకు జరిగిన పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. మూడేళ్ల కాలంలో జిల్లాలో 2,448 ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటి పాలయ్యాయి. 2020లో కురిసిన వర్షాలకు ఒక్క పాపన్నపేట మండలంలో 280 ఎకరాల్లో పత్తి, 35 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. మొత్తం 372 మంది రైతులకు సంబంధించిన పత్తి, వరి పొలాలు నీట మునిగి రూ.43 లక్షల 51 వేల 760 విలువైన పంట నష్టం జరిగింది. 2021లో వరదలకు వరి పంటకు భారీగా నష్టం జరిగింది. పాపన్నపేట మండలంలో 980 ఎకరాలు, నర్సాపూర్‌లో 105, చిల్‌పచెడ్‌లో 24, హవేళిఘనపూర్‌లో 128, నిజాంపేటలో 115, మెదక్‌లో 49 ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నది. నర్సాపూర్‌లో 23, చిల్‌పచెడ్‌లో 28 ఎకరాల్లో పత్తికి నష్టం జరిగింది. ఈసారి 1,209 మంది రైతులకు సంబంధించిన 1,401 ఎకరాల్లో వరి పంట దెబ్బతిని రూ.1.36 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరో 14 మంది రైతులకు సంబంధించిన పత్తి పంట 51 ఎకరాల్లో నష్టపోయింది. దీని విలువ రూ.5.8 లక్షలు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలో రెండుసార్లు అకాల వర్షాలు కురిశాయి. ఈ వానలకు 540 మందికి సంబంధించిన 616 ఎకరాల్లో వరి పొలాలు దెబ్బతిన్నాయి. 

 

Updated Date - 2022-05-15T05:58:02+05:30 IST