Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇదేం పెద్దాస్పత్రి?

- మూలకు చేరిన జనరేటర్‌

- సెల్‌ఫోన్‌ వెలుగులో మహిళకు ప్రసూతి వైద్యం

- పలాస సీహెచ్‌సీ తీరుపై విమర్శలు

పలాస, డిసెంబరు 4:  ఉద్దానం, మైదాన ప్రాంతాల ప్రజలకు ప్రధాన వైద్య ఆధారం ఆ ఆస్పత్రే. రోజుకు సగటున 250 మంది రోగుల ఓపీ ఉంటుంది. అత్యవసర, అనారోగ్య సమయాల్లో ఆ ఆస్పత్రే దిక్కు. ప్రసూతితో పాటు కొన్నిరకాల రుగ్మతలకు అక్కడే ఆపరేషన్లు జరుగుతుంటాయి. కానీ అందుకు అవసరమైన మౌలిక వసతులు మాత్రం అక్కడ కానరావు... ఇదీ పలాస సామాజిక ఆస్పత్రి దీనస్థితి. ఈ ఆస్పతిలో సౌకర్యాలు లేక వైద్యులు, సిబ్బందితో పాటు రోగులు పడే బాధలు వర్ణనాతీతం. శనివారం ఓ మహిళకు సెల్‌ఫోన్‌ వెలుగులో ప్రసవం చేయించారు. తుపానుతో శనివారం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ ఉన్నా మరమ్మతులకు గురై మూలకు చేరింది. దీంతో అక్కడి సిబ్బంది సెల్‌ఫోన్‌లో టార్చ్‌ వెలిగించగా వైద్యులు ప్రసవం చేయించారు. పేరుకే ఈ ప్రాంత పెద్దాస్పత్రి కానీ వసతులు అందనంత దూరంగా ఉన్నాయని రోగులు పెదవి విరుస్తున్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు ఏమైనట్టు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రమేష్‌ను ‘ఆంధ్రజ్యోతి’   వివరణ కోరగా... జనరేటర్‌ మెకానిక్‌కు బకాయి ఉండడంతో బాగుచేయడానికి రావడం లేదన్నారు. సొంత నిధులు వెచ్చించి బాగు చేయిస్తామన్నారు. రెండు రోజుల్లో జనరేటర్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Advertisement
Advertisement