‘బ్లాక్‌మ్యాజిక్‌’తో ప్రజల విశ్వాసం పొందలేరు: మోదీ

ABN , First Publish Date - 2022-08-11T08:57:29+05:30 IST

ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు పార్లమెంట్‌ ఆవరణలో ఇటీవల చేసిన ఆందోళనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ‘బ్లాక్‌మ్యాజిక్‌’తో ప్రజల విశ్వాసాన్ని

‘బ్లాక్‌మ్యాజిక్‌’తో ప్రజల విశ్వాసం పొందలేరు: మోదీ

కాంగ్రెస్‌ నేతల నిరసనపై ప్రధాని విమర్శ


పానిపట్‌, ఆగస్టు 10: ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ నేతలు పార్లమెంట్‌ ఆవరణలో ఇటీవల చేసిన ఆందోళనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ‘బ్లాక్‌మ్యాజిక్‌’తో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేరని కాంగ్రె్‌సకు పరోక్షంగా చురకలంటించారు. కాంగ్రెస్‌ నేతలు నల్లదుస్తులు ధరించి గత శుక్రవారం చేసిన ఆందోళనను ఉద్దేశించి మోదీ ఈ విమర్శ చేశారు. పానిపట్‌లోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రిఫైనరీలో ఏర్పాటు చేసిన ఇథనాల్‌ ప్లాంట్‌ను మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఆగస్టు 5న కొంతమంది బ్లాక్‌ మ్యాజిక్‌ను వ్యాపింప చేద్దామని చేసిన ప్రయత్నాన్ని మనమంతా చూశాం. నల్ల దుస్తులు ధరిస్తే తమలోని నిరాశ, నిస్పృహ అంతమైపోతాయని వాళ్లు భావించారు. కానీ, చేతబడి, గారడీలు, మూఢనమ్మకాలతో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందలేమనే విషయం వాళ్లకి తెలియదు’ అని పేర్కొన్నారు. బ్లాక్‌ మ్యాజిక్‌ వాళ్ల కష్టకాలానికి ముగింపు పలకదని కాంగ్రె్‌సను ఉద్దేశించి అన్నారు. కాగా, ఉచిత పథకాలతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే ప్రతిపక్షాలను కూడా మోదీ విమర్శించారు. ఉచితాలు దేశాభివృద్ధిని అడ్డుకుంటాయని, పెట్టుబడులు పెట్టేందుకు వనరులు లేకుండా చేస్తాయని హెచ్చరించారు. ఉచితాలు మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, దేశం స్వయం సమృద్ధి సాధించకుండా అడ్డుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-11T08:57:29+05:30 IST