SriLanka President Vote : లంక రాజెవరు? తేలేది నేడే.. ఇవీ సమీకరణాలు

ABN , First Publish Date - 2022-07-20T17:10:50+05:30 IST

దివాళా తీసిన శ్రీలంక(SriLanka) నూతన అధ్యక్షుడు(President) ఎవరు ? దేశం విడిచి పారిపోయిన గొటబాయ రాజపక్స(gotabaya rajapaksa) వారసుడు ఎవరు?

SriLanka President Vote : లంక రాజెవరు? తేలేది నేడే.. ఇవీ సమీకరణాలు

కొలంబో: దివాళా తీసిన శ్రీలంక(SriLanka) నూతన అధ్యక్షుడు(President) ఎవరు ? దేశం విడిచి పారిపోయిన గొటబాయ రాజపక్స(gotabaya rajapaksa) వారసుడు ఎవరు? అనే ప్రశ్నలకు నేడు(బుధవారం) సమాధానం తేలిపోనుంది. రహస్య ఓటింగ్ విధానంలో శ్రీలంక ఎంపీలు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మొత్తం 225 ఎంపీలు తమ ఓటు ద్వారా నూతన అధ్యక్షుడు ఎవరో తేల్చబోతున్నారు.


తాత్కాలిక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే(Ranil Wickremesinghe), అధికార పార్టీ రెబల్ నేత దుల్లస్ అలహప్పెరుమా(Dullas Alahapperuma), జేవీపీ(జనతా విముక్తి పెరమునా) పార్టీ నేత అనుర కుమార డిస్సనాయకే(Anura Dissanayake) అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. వీరి ముగ్గురిలో గెలుపొందిన నేత గొటబాయ రాజపక్స స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. 


విక్రమసింఘేకి అనుకూలప్రతికూలతలు

అధ్యక్షుడి బరిలో నిలిచిన ముగ్గురిలో ఎవరు గెలవబోతున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది. రేసులో అందరికంటే ముందున్నారని భావిస్తున్న తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేకి సానుకూలతలతోపాటు ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. 6 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన విశేష అనుభవం ఉన్నా.. ఇటివల చోటుచేసుకున్న పరిణామాలతో రాజపక్సల భాగస్వామిగా ఆయనపై ముద్రపడింది. రాజపక్స కుటుంబ పార్టీ ఎస్ఎల్‌పీపీ విక్రమసింఘేకు మద్దతిస్తోంది. కాబట్టి ఆ పార్టీ ప్రయోజనాలను విక్రమసింఘే కాపాడుతున్నారని ఆందోళనకారులు విశ్వసిస్తున్నారు. నిరసనకారులు విక్రమసింఘేకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారనే విషయాన్ని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. రాజపక్స కుటుంబ ప్రయోజనాలకు అనుగుణంగానే విక్రమసింఘే వ్యవహరిస్తున్నారని జనాలు నమ్ముతున్నారని, ఈ పరిణామం ఆయనకు ప్రతికూలమంటున్నారు.


సానుకూల విషయానికి వస్తే.. ఆందోళనలను తగ్గించేందుకు రణిల్ విక్రమ సింఘే తీసుకున్న చర్యలు ఎస్‌ఎల్‌పీపీ ఎంపీలను మెప్పించి ఉండొచ్చని ప్రతిపక్ష ఎంపీ ఒకరు అభిప్రాయపడ్డారు. ఎస్ఎల్‌పీపీకి చెందిన ఎంపీలందరూ రణిల్ విక్రమ సింఘేకి మద్ధతు తెలిపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్ఎల్‌పీపీ పార్టీకే ఎక్కువ మంది సభ్యులున్నారని ఆయన చెప్పారు.


కాగా రణిల్ విక్రమసింఘేకు ప్రధాన పోటీదారుగా ఎస్ఎల్‌పీపీ అసమ్మతి నేత, మాజీ విద్యాశాఖ మంత్రి దుల్లస్ అలహప్పెరుమా అధ్యక్షడి రేసులో ఉన్నారు. ‘‘ శ్రీలంక చరిత్రలో తొలిసారి నిజమైన ఏకాభిప్రాయడంతో ప్రభుత్వం ఏర్పాటవబోతుంది’’ అని ఇటివల ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దుల్లస్ గెలిస్తే ప్రధానమంత్రిగా 63 ఏళ్ల సజిత్ ప్రేమదాసను నియమించుకునే అవకాశం ఉంది. ప్రేమదాస్ తండ్రి 1980 దశకంలో శ్రీలంక ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపారు. 


ఇక మూడవ అభ్యర్థి విషయానికి వస్తే.. అనురా దిస్సనాయకే(53) లెఫ్టిస్ట్ జేవీపీ పార్టీ నాయకుడు. ఈ పార్టీ భాగస్వామ్య పక్షాలకు కేవలం 3 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆయన గెలుపుపై అంతగా అంచనాల్లేవని పరిశీలకులు పేర్కొన్నారు. శ్రీలంక నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక ఉద్దీపన ప్యాకేజీ కోసం ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సి ఉంది. శ్రీలంకలో దాదాపు 2.20 కోట్ల మంది తీవ్ర ఆహార, ఇంధన, ఔషధ కొరతలను ఎదుర్కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం 225 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఎస్ఎల్‌పీపీ అతిపెద్ద పార్టీగా ఉంది. రహస్య బ్యాలెట్ ద్వారా నూతన అధ్యక్షుడిని ఎంపిలు ఎన్నుకోనున్నారు. అత్యవసర పరిస్థితిని పొడిగించడంతో అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉంది. అధికారం పోలీసు, భద్రతా బలగాల చేతుల్లోనే ఉంది.

Updated Date - 2022-07-20T17:10:50+05:30 IST