క్రిప్టో పేరుతో రూ. కోటికి టోకరా

ABN , First Publish Date - 2022-08-12T06:49:59+05:30 IST

క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ. కోటి కాజేశారు.

క్రిప్టో పేరుతో రూ. కోటికి టోకరా

హిమాయత్‌నగర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ. కోటి కాజేశారు. విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన వ్యక్తి నెంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు షేర్‌ వెల్త్‌ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు. తమకు లాభాలు వస్తున్నాయన్న పోస్టింగ్‌లను గ్రూప్‌లో చూసి తాను పెట్టుబడి పెడతానని బాధితుడు గ్రూప్‌ అడ్మిన్‌ను సంప్రదించాడు. కేవలం డాలర్లలోనే కుదురుతుందని అడ్మిన్‌ షరతు పెట్టాడు. బాధితుడి ఫోన్‌కు  లింక్‌ పంపాడు. బాధితుడు దాన్ని ఓపెన్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఖాతా తెరిచాడు. తొలుత రూ. లక్ష విలువైన డాలర్లు పెట్టుబడి పెట్టాడు. మొదటి రోజు రూ. 15 వేలు, రెండో రోజు రూ. 18 వేలు లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించింది. ఆ సొమ్ము తన ఖాతాలోకి కూడా ట్రాన్స్‌ఫర్‌ కావడంతో అతడికి నమ్మకం పెరిగి పలు దఫాలుగా డాలర్ల రూపంలో రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చినట్లు చూపిన సైబర్‌ నేరగాళ్లు దాంట్లో 20 శాతం తమకు చెల్లించాలని షరతు పెట్టారు. కమీషన్‌ 20 శాతం మినహాయించుకొని మిగతా డబ్బు ఇవ్వాలని బాధితుడు కోరాడు. ముందు కమీషన్‌ డబ్బులు ఇస్తేనే.. తర్వాత నీ డబ్బు పూర్తిగా తీసుకోవచ్చని నేరగాళ్లు బాధితుడికి చెప్పారు. కొన్ని రోజుల తర్వాత యాప్‌లో విత్‌డ్రా ఆప్షన్‌ లేకపోవడంతో గ్రూప్‌ అడ్మిన్‌తోపాటు తనకు కాంటాక్ట్‌లో ఉన్న వారికి ఫోన్‌ చేయగా, ఎవరూ స్పందించ లేదు. బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. అలాగే విదేశాల్లో ఉద్యోగం పేరుతో సైదాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ నుంచి కూడా సైబర్‌ నేరగాళ్లు రూ. 8 లక్షలు కాజేశారు. 


..రూ. 6 వేల పెట్రోల్‌ ఫ్రీ

డేటా చౌర్యానికి సైబర్‌ నేరగాళ్ల ఎత్తుగడ 

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘ఇండియన్‌ ఆయిల్‌ నుంచి మాట్లాడుతున్నాం.. మేమడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తే.. మీకు రూ. 6 వేల విలువైన పెట్రోల్‌ ఫ్రీ’.. మిమ్మల్ని ఎవరైనా ఫోన్‌లో ఇలా అడిగితే.. పెట్రోల్‌ కోసం ఆశపడి ఊ కొట్టారో..!! ఇక, అంతే సంగతి. ఎందుకంటే డేటా చౌర్యానికి సైబర్‌ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త పద్ధతి ఇది. రకరకాల ఎత్తులతో ప్రజలను బురిడీ కొట్టించే సైబర్‌ కేటుగాళ్లు.. అందరికీ నిత్యావసరంగా మారిన పెట్రోల్‌ను ఇటీవల తమ ఆయుధంగా చేసుకున్నారు. ఇండియన్‌ ఆయిల్‌ సర్వే అంటూ ఫోన్‌ చేసి కొన్ని ప్రశ్నలు అడుగుతామని, వాటికి సరైన సమాధానం చెబితే లక్కీడ్రాలో రూ. 6 వేల విలువైన పెట్రోల్‌ ఉచితంగా పొందవచ్చని ఆశ చూపిస్తున్నారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-08-12T06:49:59+05:30 IST