Abn logo
Apr 17 2021 @ 00:42AM

నేరగాడి‌ అప్పగింత

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారతదేశానికి అప్పగించేందుకు బ్రిటన్‌ హోంమంత్రి ప్రీతీపటేల్‌ ఆమోదం తెలియచేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వపు ఉత్తర్వులతో నీరవ్‌ ఇప్పటికిప్పుడు భారత్‌లో అడుగుపెట్టకపోయినా, ఈ తరహా బడాచోరుల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తున్నదన్న సందేశమైతే ప్రజల్లోకి వెడుతుంది. పద్నాలుగువేలకోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్‌ రాకకోసం ముంబైలోని అర్ధర్‌రోడ్‌ జైలులో ప్రత్యేక వీఐపీ బ్యారక్‌ నిరీక్షిస్తోంది. బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయాన్ని నీరవ్‌ పద్నాలుగు రోజుల నోటీసుతో, నెలరోజుల్లోగా అక్కడి హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. విజయ్‌ మాల్యాలాగా హైకోర్టులో వాదనలూ ప్రతివాదనలతో ఎక్కువకాలం నెట్టుకొచ్చే అవకాశాలైతే ఈయన విషయంలో తక్కువేనని నిపుణులు అంటున్నారు.


భారత్‌లో తనమీద నిష్పక్షపాతంగా విచారణ జరగదంటూ నీరవ్‌ మోదీ చేసిన వాదనలను తిరస్కరిస్తూ రెండునెలల క్రితం వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌కోర్టు అప్పగింతకు అనుకూలంగా తీర్పుచెప్పిన విషయం తెలిసిందే. భారత్‌ తన మానవహక్కులను గౌరవించదనీ, అసలే అనారోగ్యంగా ఉన్న తనను జాగ్రత్తగా చూసుకోదనీ ఆయన వాదించాడు. పన్నెండో నెంబరు బ్యారక్‌ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందనీ, గాలీ వెలుతురూ చక్కగా వస్తాయని న్యాయమూర్తికి తెలియచేసిన భారత్‌, ఇందుకు సమర్థనగా వీడియోలను కూడా పంపింది. విజయ్‌మాల్యా కేసులోనూ ఇదే విధమైన వాదనలు సాగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ బ్యారక్‌లో ఉన్నవారంతా వైట్‌కాలర్‌ నేరగాళ్ళే. ఇక, బ్యాంకు సిబ్బంది సహకారంతో నకిలీ ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌’ (ఎల్‌వోయూ) లతో నీరవ్‌మోదీ భారీ మొత్తంలో బ్యాంకు సొమ్ము దిగమింగినట్టు న్యాయస్థానం విశ్వసించింది.


నిధులు సరిహద్దులు దాటడం, సాక్ష్యాలు మాయంచేయడం, సాక్షులను బెదిరించడం ఇత్యాది ఆరోపణలపై భారత్‌ అందించిన ఆధారాలను జడ్జి విశ్వసించారు. మనీలాండరింగ్‌కు వీలుగా బోగస్‌ సంస్థలను సృష్టించడం, కొంతమందిని డైరక్టర్లుగా నియమించడం, వారిలో కొందరిని కైరోలో బంధించి వారి ఫోన్‌లను దుబాయ్‌లో నాశనం చేయడం వంటి అనేకానేక విన్యాసాలకు మన దర్యాప్తు సంస్థలు గట్టి ఆధారాలే సంపాదించగలిగాయి. ఈ కారణంగానే నీరవ్‌ బెయిల్‌ విజ్ఞప్తులను న్యాయస్థానం పలుమార్లు తిరస్కరించి, చివరకు అప్పగింత ఆదేశాలు ఇచ్చింది. 


నీరవ్‌కు రెండేళ్ళముందు బ్యాంకులను ముంచి పారిపోయిన విజయ్‌మాల్యా బెయిల్‌మీదకు బయటకు రాగలిగినా, నీరవ్‌ మాత్రం రెండేళ్ళుగా జైలులోనే ఉన్నాడు. కానీ, 2018 జనవరి ఫస్టున ఆయన దేశం విడిచిపోయిన నెలరోజుల తరువాత కానీ  ఆయన పంజాబ్‌నేషనల్‌ బ్యాంకును వేలకోట్లకు ముంచిపోయాడంటూ సీబీఐ కేసు నమోదుచేయలేదు. 2019మార్చి వరకూ లండన్‌లో ఆయన అరెస్టు సాధ్యపడలేదు. వరుసగా ఏడేళ్ళపాటు ఆయన నకిలీ ఎల్‌వోయూలతో రుణాలు కొల్లగొడుతూంటే, బ్యాంకులు మాటమాత్రంగా కూడా వాటిని పరీక్షించకుండా వేలకోట్లు ఆయనకు ధారపోయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతర్గత ఆడిట్లలోనూ ఈ రహస్యం ఎందుకు చిక్కలేదో తెలియదు కానీ, ఈయన దెబ్బకు బ్యాంకింగ్‌ వ్యవస్థ డొల్లతనం మరోమారు బయటపడింది. అంత దెబ్బ తిన్న తరువాత కూడా బ్యాంకులు ఈ తరహా మోసాలను నిరోధించలేకపోవడం, తరువాతి సంవత్సరాల్లో అవి మరింత పెరగడం విచిత్రం.


డైలీ టెలిగ్రాఫ్‌ పాత్రికేయులు ముగ్గురు నడివీధిలో నడిచిపోతున్న నీరవ్‌ను గుర్తుపట్టడంతో, భారతదేశం ఒత్తిడిపెంచకా తప్పలేదు, బ్రిటన్‌ అరెస్టు చేయకాతప్పలేదు. మొన్న ఫిబ్రవరిలో బ్రిటన్‌ కోర్టులో మన వాదన నెగ్గినందుకూ, ఇప్పుడు ప్రభుత్వం అప్పగింతకు సరేనన్నందుకూ కచ్చితంగా సంతోషించాల్సిందే. కానీ, తదుపరి హైకోర్టు ఘట్టాన్ని మరింత సమర్థవంతంగా గట్టెక్కించగలిగితేనే నీరవ్‌ను వెనక్కుతీసుకురావడం సాధ్యం. బ్రిటన్‌తో నేరగాళ్ళ అప్పగింత ఒప్పందాన్ని కుదర్చుకొన్న రెండు దశాబ్దాల కాలంలో కేవలం ఇద్దరిని మాత్రమే మనం విజయవంతంగా వెనక్కుతీసుకురాగలిగాం.

Advertisement
Advertisement
Advertisement