తొమ్మిది ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-15T09:39:26+05:30 IST

కొవిడ్‌ చికిత్సల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న తొమ్మిది ఆసుపత్రులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

తొమ్మిది ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు

  • అనుమతి లేకుండా చికిత్స, అదనపు వసూళ్లు
  • ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స నిరాకరణ
  • విజిలెన్స్‌ దాడుల్లో వెలుగులోకి  అక్రమాలు

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ చికిత్సల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న తొమ్మిది ఆసుపత్రులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. మరికొన్ని ఆసుపత్రుల్లోనూ ఉల్లంఘనలను గుర్తించారు. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో గుర్తించిన అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 13 ఆసుపత్రుల్లో తనిఖీలు చేయగా తొమ్మిది ఆసుపత్రుల్లో అక్రమాలను గుర్తించినట్లు తెలిపారు. కొవిడ్‌ బాధితుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకంటే భారీగా వసూలు చేయడంతోపాటు, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సకు నిరాకరించడం, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారి నుంచి కూడా ఫీజులు వసూలు చేయడం, రెమెడెసివర్‌ ఇంజక్షన్లను అదనపు నగదుకు విక్రయించడం వంటి అక్రమాలకు ఈ ఆసుపత్రులు పాల్పడుతున్నట్లు వివరించారు.


ఇప్పటివరకు మొత్తం 46 ఆసుపత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదుచేశామని, వీటిలో గుంటూరు జిల్లాలోని అంజిరెడ్డి ఆసుపత్రులపై రెండు ఉన్నాయని తెలిపారు. అంజిరెడ్డికి చెందిన పిడుగురాళ్ల ఆసుపత్రిపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు అనుమతి లేకపోయినా కొవిడ్‌ చికిత్స చేస్తున్న నర్సరావుపేట బ్రాంచ్‌ ఆసుపత్రిపై మరో ఫిర్యాదు వచ్చిందని, దానికి రూ.3.38 లక్షల జరిమానా విధించామన్నారు. దీనిపై రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని నిర్ణయించామన్నారు. 


కేసులు నమోదు చేసిన ఆసుపత్రులు: విశాఖపట్నంలోని ఆదిత్య హాస్పిటల్‌, దుర్గా హాస్పిటల్‌, కడపలో సంజీవిని హాస్పిటల్‌, కాకినాడలో ఐనోదయ, కేర్‌ ఎమర్జెన్సీ హాస్పిటల్‌, జంగారెడ్డిగూడెంలో చిరంజీవి హాస్పిటల్‌ తదితర ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. కాగా, రెమెడిసివర్‌ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నందన విశాఖపట్నంలో ఇద్దరిపై, నెల్లూరులో నలుగురిపై, విజయవాడలో ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2021-05-15T09:39:26+05:30 IST