Abn logo
Mar 26 2020 @ 03:54AM

పక్కాగా లాక్‌డౌన్‌

ఎక్కడికక్కడ రహదారులను మూసేసిన పోలీసులు

అత్యవసర పనులపై వెళ్లే వారికి మాత్రమే అనుమతి

తెరుచుకోని దుకాణాలు

పూర్తిగా తగ్గిన జనసంచారం

కర్ఫ్యూను తలపించిన వాతావరణం

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై క్రిమినల్‌ కేసులు

అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 61 మంది అరెస్టు

53 వాహనాలు సీజ్‌

ఆకతాయిలపై కొరడా

హెల్మెట్‌ ధరించనందుకు మరో 1,213 మందిపై కేసులు

నగరంలో పరిస్థితిపై డీజీపీ సమీక్ష

మరో 20 రోజులు ప్రజలు రహదారుల పైకి రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన లాక్‌డౌన్‌ జిల్లాలో బుధవారం నుంచి పక్కాగా అమలవుతోంది. విశాఖ నగరాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే జాతీయ రహదారితోపాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఇటు తగరపువలస కూడలి నుంచి అటు పాయకరావుపేట వరకూ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ పోలీస్‌ పికెట్లు ఏర్పాటుచేశారు. జాతీయ రహదారికి అనుసంధానంగా వున్న రోడ్లను కూడా మూసేశారు.


ఆ విధంగా ఆయా రోడ్ల నుంచి వాహనాలు జాతీయ రహదారిపైకి వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. అంబులెన్స్‌లు, ఆస్పత్రి అవసరాలపై వెళ్లేవారి వాహనాలను మాత్రమే అనుమతించారు. మిగిలిన వారి వాహనాలను సీజ్‌ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదుచేశారు. దీనివల్ల రోడ్లపై ఎక్కడా ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలు కనిపించలేదు. ఆర్టీసీ సర్వీసులను నిలిపేయడంతో అత్యవసర పనులపై వెళ్లేవారంతా ద్విచక్ర వాహనాలను మాత్రమే వినియోగించారు. బుధవారం నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్టు ప్రకటించడంతోపాటు అది అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యతను ప్రధాని మోదీ రాష్ట్రాలకు అప్పగించారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే వుండాలనే విషయాన్ని ప్రజలంతా సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ప్రధాని సూచనను ప్రజలు పాటించారు.


వాణిజ్య దుకాణాలు కూడా తెరుచుకోలేదు. పెట్రోలు బంకులు తెరుచుకున్నప్పటికీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. నిత్యం రద్దీగా వుండే నగరంలోని రోడ్లన్నీ బోసిపోవడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. పర్యాటకులు, సందర్శకులతో సందడిగా ఉండే బీచ్‌రోడ్డు జనసంచారం లేక బోసిపోయింది. 


లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై క్రిమినల్‌ కేసులు

కరోనా నియంత్రణలో భాగంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ ఉల్లంఘనులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. లాక్‌డౌన్‌ పాటించకుండా విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేశారు. ప్రజలంతా ఇంట్లోనే  గడపాలంటూ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా సరే...కొంతమంది ఆకతాయిలు ఎలాంటి అవసరం లేకపోయినా సరే వాహనాలతో రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ పికెట్‌లు ఏర్పాటుచేసి వాహనాలపై వచ్చే వారిని...ఏ అవసరంపై ఇంటి నుంచి బయటకు వచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. సంతృప్తికరమైన, సరైన సమాధానాలు చెప్పని వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదుచేశారు.


బుధవారం 61 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. వారు వినియోగించిన 53 వాహనాలను సీజ్‌ చేశారు. ఐపీసీ కింద 28 కేసులు నమోదుచేశారు. అదేవిధంగా ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా వాహనాలను నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న 1,213 మందిపై మోటారు వాహనాల చట్టం కింద కేసులు నమోదుచేసి రూ.3.8 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశారు. అరెస్టు చేసిన వారికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరుచేశారు. 


లాక్‌డౌన్‌పై డీజీపీ సమీక్ష

నగరంలో లాక్‌డౌన్‌ ఎలా అమలవుతున్నదీ తెలుసుకునేందుకు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలయ్యేందుకు తీసుకున్న చర్యలతోపాటు బుధవారం పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుబజార్ల నుంచి కొంతమంది రైతలను మైదానాలకు తరలింపు, అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు, వ్యక్తులకు మాత్రమే మినహాయింపు ఇవ్వడం గురించి సీపీ ఆర్కే మీనా వివరించారు. మరో 20 రోజులపాటు ఇదే మాదిరిగా చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీపీ ఆర్కే మీనాకు డీజీపీ సూచించినట్టు తెలిసింది. నగరంలో రోడ్లపై అనవసరంగా ఎవరూ తిరగకుండా, ఇంట్లోనే గడిపేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం.


Advertisement
Advertisement
Advertisement