13 రైస్‌ మిల్లులపై క్రిమినల్‌ కేసులు!

ABN , First Publish Date - 2022-05-19T08:03:22+05:30 IST

ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి సకాలంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వాల్సిన రైస్‌ మిల్లర్లు కొందరు మొండికేస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో సీఎంఆర్‌ డెలివరీ ఇవ్వాల్సి ఉండగా..

13 రైస్‌ మిల్లులపై క్రిమినల్‌ కేసులు!

  • 2019-20 యాసంగి సీఎంఆర్‌ ఇప్పటికీ పెండింగ్‌.. 
  • రెండేళ్లు అవకాశమిచ్చినా బియ్యం ఇవ్వని మిల్లర్లు


హైదరాబాద్‌, మే 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి సకాలంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వాల్సిన రైస్‌ మిల్లర్లు కొందరు మొండికేస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో సీఎంఆర్‌ డెలివరీ ఇవ్వాల్సి ఉండగా.. ఏకంగా రెండేళ్లు దాటిపోయినా బియ్యం బకాయిలు తీర్చటం లేదు. దీంతో 13 మంది రైస్‌ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ క్రిమినల్‌ కేసుల నమోదుకు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయా జిల్లాల్లో ఎక్కడికక్కడ రైస్‌ మిల్లర్లపై కేసులు నమోదవుతున్నాయి. 2019-20 యాసంగి సీజన్‌కు సంబంధించి 102 రైస్‌ మిల్లులు లక్ష టన్నుల బియ్యం బకాయి పడిన విషయం విదితమే! ఏడాది వరకు గడువు ఇచ్చిన ఎఫ్‌సీఐ.. ఆ తర్వాత సీఎంఆర్‌ తీసుకునేది లేదని స్పష్టంచేసింది. దీంతో బియ్యం రికవరీ బాధ్యతను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ తీసుకుంది. సుమారు రూ.400 కోట్ల విలువైన బియ్యాన్ని రైస్‌ మిల్లర్ల నుంచి రికవరీ చేయకపోతే.. ఆ నష్టాన్ని పౌరసరఫరాలశాఖ భరించాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రతి నెలా బ్యాంకు వడ్డీని కార్పొరేషన్‌ చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ పూల్‌ కింద తీసుకునే అవకాశం లేకపోవటంతో.. స్టేట్‌ పూల్‌ కింద తీసుకుంటామని రైస్‌ మిల్లర్లకు అవకాశం ఇచ్చింది. రెండేళ్లకు పైగా జాప్యం కావటంతో... 25ు జరిమానాతో (100 క్వింటాళ్లకు బదులుగా 125 క్వింటాళ్లు) బియ్యం ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ గతంలో ఆదేశించింది. ఇచ్చిన అవకాశాన్ని కొందరు మిల్లర్లు వినియోగించుకోగా... మరికొందరు పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం/బియ్యం అమ్ముకొని.. సీఎంఆర్‌ డెలివరీ మాత్రం ఇవ్వటంలేదు. 


బియ్యం ఎగ్గొట్టిన మిల్లర్ల జాబితాలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 36 మంది, హనుమకొండ జిల్లాలో 12 మంది, కరీంనగర్‌ జిల్లాలో 12 మంది, వరంగల్‌ జిల్లాలో ఆరుగురు, సూర్యాపేట జిల్లాలో ఆరుగురు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదుగురు ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో ముగ్గురు, నలుగురు చొప్పున ఉన్నారు. అయితే పౌరసరఫరాల సంస్థ అధికారుల ఒత్తిడిమేరకు 67,947 టన్నుల బియ్యం రికవరీ అయ్యాయి. ఇవి కూడా జరిమానా(25ు) కాకుండా అసలు కోటా బియ్యం మాత్రమే కావటం గమనార్హం. ఎలాగూ కొద్దో, గొప్పో ఇచ్చారనే ఉద్దేశంతో.. 89 మంది మిల్లర్లపై ఎలాంటి చర్యలకు సిఫారసు చేయలేదు. కానీ ఇప్పటికీ 2019- 20 సీఎంఆర్‌ బియ్యం బకాయిల డెలివరీ ప్రారంభించని రైస్‌ మిల్లర్లు 13 మంది ఉన్నా రు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు. హనుమకొండ ఆరుగురు, వరంగల్‌ ముగ్గురు, మెదక్‌ జిల్లాలో ఒక మిల్లరు ఉన్నారు. వీరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పౌర సరఫరాల సంస్థ ఉత్తర్వులిచ్చింది.


భూపతి ఇండస్ట్రీస్‌(గొర్రెకుంట-వరంగల్‌), శ్రీ సాయిబాలాజీ ట్రేడర్స్‌(నర్సంపేట-వరంగల్‌), అశోకా ఇండస్ట్రీస్‌(నర్సంపేట-వరంగల్‌), భవానీ ఇండస్ట్రీస్‌(కేవసారం-పెద్దపల్లి), భవా నీ ఇండస్ట్రీస్‌(గోట్ల కనపర్తి- పెద్దపల్లి), జానకిరామ ఇండస్ట్రీస్‌(పూసల-పెద్దపల్లి), శ్రీచైతన్య ఇండస్ట్రీస్‌(మాసాయిపేట్‌-మెదక్‌), బాలాజీ సటాకే రైస్‌ ఇండస్ట్రీస్‌(హసన్‌పర్తి-హనుమకొండ), వసుధ లక్ష్మీఇండస్ట్రీస్‌(కేయూసీ-హనుమకొండ), శ్రీ కార్తికేయ ఇండస్ట్రీస్‌(నక్కలపల్లి-హనుమకొండ), లక్ష్మీ వెంకటేశ్వరఇండస్ట్రీస్‌(కంభంపల్లి-హనుమకొండ), అంజలి ఆగ్రో ఇండస్ట్రీస్‌(పెంబట్ల-హనుమ కొండ), రుద్రమాంబ ఇండస్ట్రీస్‌(హనుమకొండ) రైస్‌మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఒకవైపు పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తూనే.. మరోవైపు బియ్యం రికవరీ అయ్యేలా చూడాలని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌కు కూడా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సూచించింది. సీఎంఆర్‌ బకాయిలున్న మిల్లర్లకు మళ్లీ తర్వాత సీజన్‌లో ధాన్యం మిల్లింగ్‌ ఇవ్వొద్దని కూడా నిర్ణయించారు. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిఽధులతో రైస్‌మిల్లర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. 

Updated Date - 2022-05-19T08:03:22+05:30 IST