సర్జరీలు చేసిన డాక్టర్‌పై క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2022-09-25T07:41:51+05:30 IST

ఇబ్రహీంపట్నం సివిల్‌ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన ఘటనలో 13 మందిపై సర్కారు వేటు వేసింది.

సర్జరీలు చేసిన డాక్టర్‌పై క్రిమినల్‌ కేసు

  • ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన.. 13 మందిపై వేటు
  • రంగారెడ్డి డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌ బదిలీ
  • కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో 
  • జాయింట్‌ డైరెక్టర్‌గా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి
  • షాద్‌నగర్‌ ఆస్పత్రికి డీసీహెచ్‌ఎస్‌ బదిలీ
  • ఇన్‌చార్జి, డ్యూటీ డాక్టర్‌, హెడ్‌ నర్సుల సస్పెన్షన్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
  • మిగిలిన వారిపైనా ఒకటి రెండు రోజుల్లో వేటు
  • పునరావృతం కాకుండా సర్కారు మార్గదర్శకాలు 
  • ప్రభుత్వ తీరుపై మండిపడిన వైద్యులు


హైదరాబాద్‌, ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం సివిల్‌ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన ఘటనలో 13 మందిపై సర్కారు వేటు వేసింది. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మితోపాటు డీసీహెచ్‌ఎస్‌ ఝాన్సీలక్ష్మిని వెంటనే బదిలీ చేసింది. స్వరాజ్యలక్ష్మిని ఆ స్థానం నుంచి తప్పించింది. ఆమెకు కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించింది. జిల్లా ఆస్పత్రుల వైద్య సేవల కో ఆర్డినేటర్‌ (డీసీహెచ్‌ఎస్‌) ఝూన్సీ లక్ష్మీని షాద్‌నగర్‌ ఆస్పత్రిలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోగా మెదక్‌ డీఎంహెచ్‌వోగా ఉన్న డాక్టర్‌ బి.వెంకటేశ్వరరావును నియమించింది. మెదక్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో బి.విజయనిర్మలకు అదే జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించింది. ఇక, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వరదాచారికి రంగారెడ్డి డీసీహెచ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే సస్పెండైన ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీధర్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్‌ జోయల్‌ సునీల్‌ కుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి సంబంధించిన డీపీఎల్‌ క్యాంపు ఆఫీసర్‌ డాక్టర్‌ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ గీత, హెడ్‌ నర్స్‌ చంద్రకళ, మాడుగుల్‌ పీహెచ్‌సీ డాక్టర్‌ శ్రీనివాస్‌, సూపర్‌వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల్‌ పీహెచ్‌సీ డాక్టర్‌ కిరణ్‌, సూపర్‌వైజర్‌ జయలత, దండుమైలారం పీహెచ్‌సీ డాక్టర్‌ పూనం, సూపర్‌వైజర్‌ జానకమ్మపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు 13 మందిపై చర్యలు తీసుకుంటూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వ్యులు జారీ చేశారు. ఆ వెంటనే స్టెరిలైజేషన్‌ విధుల్లో ఉన్న హెడ్‌ నర్స్‌ చంద్రకళ, డీపీఎల్‌ క్యాంపు ఇన్‌చార్జి డాక్టర్‌ నాగజ్యోతిని సస్పెండ్‌ చేస్తూ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో గత నెల 25న 34 మంది మహిళలకు డబుల్‌ పంక్చర్‌ ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీ చేయగా వారంతా ఇన్ఫెక్షన్‌ బారిన పడిన విషయం తెలిసిందే. వారిలో నలుగురు మరణించారు. సర్జరీ జరిగిన తర్వాత మరుసటి రోజు లావణ్య అనే మహిళ ఇన్ఫెక్షన్‌తో ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి వచ్చింది. సరిగా చికిత్స చేయకుండా ఆమెను ఇంటికి పంపారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆమె మరణించారు.


 లావణ్య ఆస్పత్రికి వచ్చిన సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్‌ గీతను కూడా సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం సివిల్‌ ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్లు వికటించిన ఘటనలను సర్కారు సీరియ్‌సగా తీసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇక, మాడ్గుల్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, సూపర్‌వైజర్‌ మంగమ్మ, మంచాల్‌ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కిరణ్‌, సూపరవైజర్‌ జయలత, దండుమైలారం మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పూనమ్‌, సూపర్‌ వైజర్‌ జానకమ్మను కూడా ఒకటి రెండు రోజుల్లో సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది. అలాగే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కు.ని. ఆపరేషన్ల నిర్వహణ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని విధిగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


సర్కారు తీరుపై వైద్యుల మండిపాటు

ఇబ్రహీంపట్నం కు.ని. ఘటనలో ప్రభుత్వం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంపై సర్కారీ వైద్యులు, వైద్య సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో తప్పులేదని, కానీ, ఆ ఘటనతో సంబంధమే లేని వైద్యులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇక తీసుకున్న చర్యలు కూడా కొందరికి మేలు కలిగించేలా ఉన్నాయని వైద్యులు ఆరోపిస్తున్నారు. కు.ని. ఘటనలో డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేసి ఆమెను కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కార్యాలయంలో జేడీగా నియమించడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఆమెపై క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి బదులుగా సర్కారు ఒక రకంగా పదోన్నతి ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ లాలు ప్రసాద్‌ విమర్శించారు. వైద్య సిబ్బందిపై చర్యల విషయంలో సర్కారు తీరు సరిగా లేదని ఆయన ఆరోపించారు. కుటుంబ నియంత్రణ, స్టెరిలైజేషన్‌పై ఉన్నతాఽధికారులు రివ్యూలు చేయలేదన్నారు. రిటైర్డ్‌ వైద్యుడిపై క్రిమినల్‌ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.  ఇటువంటి సర్జరీలకు పదవీ విరమణ చేసిన వైద్యులను ఎందుకు నియమించుకుంటున్నారని నిలదీశారు. అలాగే, ఆ ఘటనతో ఎటువంటి సంబంధం లేని వైద్యులపై ఎలా చర్యలు తీసుకుంటారని తెలంగాణ మెడికల్‌ జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సరిగా జరగలేదని, అసలు కమిటీనే సరిగా లేదని ఆరోపించారు.


సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే!

నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఒక ఆస్పత్రి లో ఒకేరోజు 30కిమించి శస్త్రచికిత్సలు చేయరాదు.


ఆస్పత్రుల సేవల్లో భాగంగా నిర్దేశించిన రోజుల్లోనే కు.ని ఆపరేషన్లు చేయాలి. ఆపరేషన్‌ తర్వాత 24 గంటల పాటు విధిగా అబ్జర్వేషన్‌లో ఉంచాలి.

క్యాలెండర్‌ ప్రకారం ఆపరేషన్‌ చేయించుకునేవారు వారికి ఇష్టం ఉన్న రోజుల్లో రావచ్చు.


డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన రోగిని సంబంధిత ఆస్పత్రి సూపర్‌వైజర్‌ 24 గంటల్లోగా ఒకసారి, వారంలోగా మరో రెండు సార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి.


సంబంధిత పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ కూడా వారి పరిధిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న వారందరినీ రెండు రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలి. ఆపరేషన్లు చేయించుకున్న వారిని సంబంధిత సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తున్నారా లేదా పరిశీలించాలి.


ప్రీ ఆపరేటివ్‌, ఇంట్రా ఆపరేటివ్‌, పోస్ట్‌ ఆపరేటివ్‌ ప్రమాణాలు పాటించేలా ఆస్పత్రి సూపరింటెండెం ట్‌, సర్జన్‌, డీపీఎల్‌ క్యాంపు ఆఫీసర్‌ చూసుకోవాలి.


ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలను గుర్తు పట్టే విధంగా సూపర్‌వైజర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించాలి. డీపీఎల్‌ సర్జన్ల నైపుణ్యాన్ని అంచనా వేసేలా ఏడాదికోసారి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.


కమిషనర్‌ ఆఫీసులోని రాష్ట్రస్థాయి జాయింట్‌ డైరెక్టర్‌ మూడు నెలలకు ఒకసారి స్టెరిలైజేషన్‌ మీద కు.ని. నిర్వహణ అధికారులు, సర్జన్లు, ఇతర సిబ్బందితో సమీక్ష జరపాలి.


ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న సూపరింటెండెంట్లు ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్‌ నివారణ, నియంత్రణపై సమీక్ష నిర్వహించాలి. బోధనాస్పత్రులు, టీవీవీపీ ఆస్పత్రుల్లోని ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ ఆఫీసర్లు, నర్సులకు ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు నిమ్స్‌ ఆస్పత్రిలో శిక్షణనివ్వాలి. ఇన్ఫెక్షన్‌ నివారణ ప్రమాణాలు పాటించేలా డీఎంఈ, టీవీవీపీ కమిషనర్‌ చూసుకోవాలి.

Updated Date - 2022-09-25T07:41:51+05:30 IST