సివిల్‌ కేసుల్లో జోక్యమొద్దు

ABN , First Publish Date - 2022-06-30T05:40:15+05:30 IST

సివిల్‌ కేసుల్లో జోక్యమొద్దు

సివిల్‌ కేసుల్లో జోక్యమొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

జిల్లా నేర సమీక్షలో పోలీసులకు ఎస్పీ సూచన

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : సివిల్‌ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని ఎస్పీ పి.జాషువా ఆదేశించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా నేర సమీక్షా సమావేశం బుధవారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ సివిల్‌ కేసులు కోర్టుల్లోనే పరిష్కారం కావాలన్నారు. ఈ తరహా కేసుల పట్ల పోలీసులు శ్రద్ధపెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం స్పందన ద్వారా ప్రజల నుంచి అర్జ్జీలు స్వీకరించాలని, సివిల్‌ కేసులు వస్తే కోర్టుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించాలని చెప్పారు.

మహిళల కేసుల్లో అప్రమత్తం

మహిళలకు సంబంధించిన నేరాల అదుపులో, కేసుల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎస్‌ఐ, ఆపైస్థాయి అధికారి మాత్రమే విచారణ చేసి బాధితులకు అండగా ఉండాలన్నారు. దిశా కేసులను నిశితంగా పరిశీలించి, తక్షణ కార్యాచరణకు దిగాలని సూచించారు. రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయాలని, అపరిచిత వ్యక్తులను ఎంతమందిని గుర్తించారో నమోదు చేయాలని చెప్పారు. రాత్రిపూట తిరిగే ఆటోల వివరాలు నమోదు చేసుకుని తరచూ తనిఖీలు చేస్తూ ఉండాలని హితవు పలికారు. 

పెండింగ్‌ కేసులు పరిష్కరించండి

పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు నెల గడువు ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో పరిచయాలు పెంచుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులు, సిబ్బందిపై విచారణ చేస్తామని, నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ఎన్‌.వెంకటరామాంజనేయులు, నాలుగు డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:40:15+05:30 IST