మంచం మరమ్మతు కోసం ఫోన్‌ చేస్తే ఖాతా నుంచి రూ. 94 వేలు కాజేత

ABN , First Publish Date - 2022-08-09T06:07:35+05:30 IST

సైబర్‌ నేరగాడి మాటలు నమ్మి విశ్రాంత ఉద్యోగి మోసపోయాడు.

మంచం మరమ్మతు కోసం ఫోన్‌ చేస్తే   ఖాతా నుంచి రూ. 94 వేలు కాజేత

బోయినపల్లి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాడి మాటలు నమ్మి విశ్రాంత ఉద్యోగి మోసపోయాడు. బోయినపల్లి సీఐ సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లిలో నివసిస్తున్న రేఖల శ్యామ్‌ అమృతరావు విశ్రాంత ఉద్యోగి. గోద్రేజ్‌ హైడ్రాలిక్‌ మంచం మరమ్మతు కోసం గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. సైబర్‌ నేరగాడు లైన్‌లోకి వచ్చి గోద్రేజ్‌ కంపెనీకి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. అమృతరావు విషయం అతడికి చెప్పాడు. కంపెనీకి చెందిన వ్యక్తి మీ వద్దకు వస్తాడని, అతడికి డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నాడు. తన వద్ద ఆన్‌లైన్‌ పేమెంట్‌ యాప్‌ లేదని, నెట్‌ బ్యాంకింగ్‌ మాత్రమే ఉందని అమృతరావు చెప్పాడు. సైబర్‌ నేరగాడు టీమ్‌ వీవర్‌ అనే యాప్‌ను అమృతరావుతో డౌన్‌లోడ్‌ చేయించాడు. ఆ యాప్‌ ద్వారా వచ్చిన ఓటీపీలను అమృతరావు చెప్పాడు. సైబర్‌ నేరగాడు వాటి ద్వారా రెండుసార్లు రూ. 94 వేలు అమృతరావు ఖాతా నుంచి డ్రా చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  


Updated Date - 2022-08-09T06:07:35+05:30 IST