ఆనవాళ్లు లేవు.. అనుమానాలే!

ABN , First Publish Date - 2022-05-05T06:30:22+05:30 IST

శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. కొట్టిన ఆనవాళ్లు లేవు. ముక్కు నుంచి అయిన రక్తస్రావం మాత్రమే పైకి కనిపించింది.

ఆనవాళ్లు లేవు.. అనుమానాలే!

కారు డ్రైవర్‌ బాషా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

  సహజీవనం చేస్తున్న మహిళను విచారించిన పోలీసులు

విజయవాడ, మే 4(ఆంధ్రజ్యోతి) : శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. కొట్టిన ఆనవాళ్లు లేవు. ముక్కు నుంచి అయిన రక్తస్రావం మాత్రమే పైకి కనిపించింది. ఇదొక్కడే కారు డ్రైవర్‌ అబ్దుల్‌ బాషా కేసులో అనేక అనుమానాలకు తావిస్తోంది. పటమటలంకలోని జిల్లాపరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలకు చెంతనే ఇండికా కారులో అబ్దుల్‌ బాషా మృతదేహాన్ని పోలీసులు మంగళవారం సాయంత్రం గుర్తించిన విషయం తెలిసిందే. బాషా మృతదేహానికి విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ఫోరెన్సిక్‌ వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. ముక్కు నుంచి రక్తస్రావం రావడంతో బాషాపై విషప్రయోగం ఏమైనా జరిగిందన్న అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతోంది. దీన్ని నిర్ధారించడానికి బాషా శరీరంలోని కొన్ని భాగాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపారు. మృతదేహాన్ని ఘటనా స్థలంలోనే పరిశీలించిన తర్వాత క్లూస్‌ టీం అధికారులు బాషాది సహజ మరణమని అభిప్రాయపడ్డారు. బాషా భార్య రెహ్మతున్నీసా రామలింగేశ్వర నగర్‌లో ఉంటున్న అతడి సన్నిహితురాలిపై ఆరోపణలు చేస్తోంది. బాషా మృతికి ఆమె కారణమని బహిరంగంగా చెబుతోంది. బాషా, అతడితో సన్నిహితంగా ఉంటున్న మహిళ చిన్నతనం కలిసి చదువుకున్నారు. ఆ పరిచయమే వారిద్దరిని కలిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బ్యూటీపార్లర్‌ కోర్సు చేస్తోంది. ఐదేళ్ల క్రితం ఆమెను భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి బాషాతో సన్నిహితంగా ఉంటోంది. ఈనెల ఒకటో తేదీన బాషా ఆమెను రామలింగేశ్వరనగర్‌లోని ఇంటి వద్ద నుంచి కానూరులోని బ్యూటీపార్లర్‌ వద్ద వదిలిపెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత బాషా ఆమె వద్దకు వెళ్లలేదని తెలిసింది. రెండో తేదీ నుంచి అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. బాషా ప్రయా ణికులను తీసుకుని వివిధ ప్రాంతాలకు వెళ్తుం టాడు. ఆ సమయాల్లో ఒక్కోసారి ఆయన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని వస్తుంది. బ్యూటీపార్లర్‌ నుంచి ఇంటికి కారులో వెళ్దామని స్నేహితురాలు బాషా కి ఫోన్‌ చేసింది. అప్పటికే స్విచ్చాఫ్‌ అని వచ్చింది. రెండో తేదీన భార్య రెహ్మతున్నీసా ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. ఎక్కడికైనా కిరాయికి వెళ్లాడని భార్య భావించింది. మృత దేహం ఉన్న కారు మాత్రం పడవలరేవు నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వైపునకు వస్తున్నట్టుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే రామలింగే శ్వరనగర్‌లోని స్నేహితురాలి ఇంటి నుంచి వస్తున్నట్టుగా ఉన్నది. సరిగ్గా జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల వద్దకు వచ్చేసరికి గుండెపోటు వచ్చి కారును పక్కన ఆపి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. మూడు రోజులపాటు కారులో ఉండిపోవడం, ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదుకావడంతో ఆ వేడికి ముక్కు నుంచి రక్తస్రావం జరిగి ఉంటుం దని మరికొందరు చెబుతున్నారు. యువ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్‌ను కారులో గత ఏడాది హత్య చేశారు. ఈ ఘటన తర్వాత మరోసారి పటమటలంకలో కారులో మృత దేహం కనిపించింది. దీన్ని సహజ మరణంగా ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ అనేక అను మానాలు వెంటాడుతున్నాయి. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక వచ్చిన తర్వాత బాషాది సహజ మరణమా లేక హత్య అన్నది తేలుతుంది. 


Read more