ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య

ABN , First Publish Date - 2020-03-07T07:41:39+05:30 IST

పురాణాల్లో సతీ సావిత్రి భర్త ప్రాణం కోసం యముడిని వెంటాడింది... ఎంతో మంది భార్యలు భర్తల కోసం జీవితాలనే ఫణంగా పెట్టిన దేశం

ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య

  • వివాహేతర సంబంధంతో ప్రియుడితో కలిసి దారుణం
  • ఆనవాళ్లను చెరిపివేసే ప్రయత్నం
  • ఛేదించిన పోలీసులు
  • కీలకంగా మారిన కన్న కూతురు


నెల్లూరు (క్రైం), మార్చి 6 : పురాణాల్లో సతీ సావిత్రి భర్త ప్రాణం కోసం యముడిని వెంటాడింది... ఎంతో మంది భార్యలు భర్తల కోసం జీవితాలనే ఫణంగా పెట్టిన దేశం మనిది. అలాంటి భూమిలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడినే కాటికి పంపించింది ఓ ఇల్లాలు. ప్రియుడితో భర్తను హత్య చేయించి ఆనవాలు చిక్కకుండా చేసింది. అయితే వారి కుట్ర ఎంతోకాలం దాగలేదు.. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేసి నిజం నిగ్గుతేల్చారు. నిందితులను కటకటాల వెనక్కు పంపారు. నెల్లూరులోని వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో నగర డీఎస్పీ జీ శ్రీనివాసులురెడ్డి శుక్రవారం మీడియాకు ఈ కేసు వివరాలు వెల్లడించారు.


నెల్లూరు శివార్లలోని కొత్తూరు సమీపంలో ఉన్న పోలీసు ఫైరింగ్‌ రేంజ్‌ దగ్గర గత నెల 22వతేదీ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నీళ్లు లేని 20 అడుగుల లోతు కాలువలో మృతదేహం ఉండటంపై తహసీల్దారు ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఆనవాళ్లు గుర్తు పట్టకుండా పెట్రోలు పోసి తగలబెట్టినట్లు గుర్తించారు. దీనికితోడు మృతదేహం కుళ్లిపోయి ఉంది. ఈ నేపథ్యంలో కేసు పోలీసులకు మిస్టరీగా మారింది.


సమీప ప్రాంతాల్లో కొంతకాలంగా ఎవరైనా కనిపించడం లేదా.. మిస్సింగ్‌ కేసులు ఉన్నాయా.. అనే కోణంలో స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ సుబ్బారావు, ఎస్‌ఐలు బీ లక్ష్మణ్‌రావులు, పుల్లయ్యలు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శ్రీకాకుళానికి చెందిన కొందరు తమ కుటుంబ సభ్యుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు ష్టేషన్‌కు వచ్చారు. వారికి కొత్తూరు వద్ద లభించిన మృతదేహాన్ని చూపించగా ఆ కుటుంబలోని 13ఏళ్ల పాప డెడ్‌బాడీ తన తండ్రిదని గుర్తించింది. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.


పథకం ప్రకారం...

శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాగోలు సూర్యనారాయణ, భద్రమ్మలు భార్యభర్తలు. రెండేళ్ల క్రితం కూలి పనుల కోసం నెల్లూరుకు వలస వచ్చారు. నగరంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌లో ఉంటూ బేల్దారి పనులు చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా ఇటీవలే పెద్దమ్మాయికి వివాహం చేశారు. 13 ఏళ్ల రెండో కుమార్తె ఇంటి వద్దే ఉంటోంది. కూలి పనులకు వెళుతున్న భద్రమ్మకు ఉమ్మారెడ్డిగుంట ప్రాంతంలో నివసించే సుధాకర్‌ అనే బేల్దారి మేస్త్రీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సూర్యనారాయణకు తెలియడంతో వారి కాపురంలో కలతలురేగాయి. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేసేయాలని  ప్రియుడు సుధాకర్‌ను భద్రమ్మ పురిగొల్పింది. ఇద్దరూ కలసి పథకం వేశారు.


అందులో భాగంగా ఫిబ్రవరి 12వతేదీ మధ్యాహ్నం భద్రమ్మ శ్రీకాకుళం వెళ్లింది. అదేరోజు సాయంత్రం సుధాకర్‌ సూర్యనారాయణను కలిశారు. కొత్త పని ఇప్పిస్తాను కూలీలను పెట్టుకుని మేస్త్రీగా  ఎదగాలని నమ్మబలికి తనతో తీసుకెళ్లాడు. కొత్తూరు సమీపంలోని పోలీసు ఫైరింగ్‌ రేంజ్‌ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. మద్యం మత్తులో ఉన్న సూర్యనారాయణను బండరాయితో, కర్రతో కొట్టి కాలువలో పడేశాడు. పథకం ప్రకారం తనతో తెచ్చుకున్న పెట్రోలును సూర్యనారాయణపై పోసి తగలబెట్టాడు. పోలీసులు టెక్నాలజీని ఉపయోగించుకుని ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌, లొకేటర్‌ సాయంతో కేసును ఛేదించారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన క్రైం పార్టీ సిబ్బంది ఏఎస్‌ఐ ప్రసాద్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు సుధాకర్‌,విజయమోహన్‌, జిలానీ, కానిస్టేబుళ్లు గోపాలయ్య, మస్తాన్‌, వాసవిల పేర్లకు రివార్డులకు ఎస్పీకి సిఫార్సు చేస్తామని డీఎస్పీ తెలిపారు. 

Updated Date - 2020-03-07T07:41:39+05:30 IST