నేరం–రహస్యం

ABN , First Publish Date - 2022-03-23T06:13:13+05:30 IST

సీల్డుకవర్ నివేదికల విషయంలో సుప్రీంకోర్టు గతానికి భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం ప్రజాస్వామ్య ప్రియులకూ న్యాయకోవిదులకు సంతోషం కలిగిస్తున్నది. ఇటీవల బిహార్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కేసు విచారణలో ఈ సీల్డు కవర్...

నేరం–రహస్యం

సీల్డుకవర్ నివేదికల విషయంలో సుప్రీంకోర్టు గతానికి భిన్నమైన వైఖరిని ప్రదర్శించడం ప్రజాస్వామ్య ప్రియులకూ న్యాయకోవిదులకు సంతోషం కలిగిస్తున్నది. ఇటీవల బిహార్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కేసు విచారణలో ఈ సీల్డు కవర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తీవ్ర అసహనం వెలిబుచ్చిన విషయం తెలిసిందే. కీలకమైన సమాచారం ఇందులో ఉన్నదంటూ సీనియర్ న్యాయవాది ఒకరు సీల్డు కవర్, పెన్ డ్రైవ్ లను అందివ్వబోతుంటే, ఇటువంటి సీల్డు కవర్లేమీ ఇవ్వకండి, మీ దగ్గరే పెట్టుకోండి అని ప్రధాన న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు. కీలకమైన కొన్ని కేసుల్లో ప్రభుత్వ ఏజెన్సీలు కొంత సమాచారాన్ని సీల్డు కవరులో ఉంచి న్యాయస్థానాలకు ఇవ్వడం, కోర్టులు అందులోని అంశాల ఆధారంగా తీర్పులు చెప్పడం ఇటీవల చూశాం. దేశభద్రత, విదేశీ సంబంధాలు ఇత్యాదివి ఉటంకిస్తూ ప్రభుత్వ సంస్థలు ఏదో సమాచారాన్ని ఇలా రహస్యంగా పంచే సంస్కృతికి న్యాయస్థానాలు అడ్డుకట్టవేయాలని న్యాయనిపుణులు ఎంతోకాలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు జస్టిస్ ఎన్.వి.రమణ ఈ సీల్డు కవర్ విధానంపై విముఖత ప్రదర్శించి, న్యాయస్థానంలో అన్ని వాదనలూ బహిరంగంగా జరగాల్సిందేనని స్పష్టంచేయడం స్వాగతించాల్సిన విషయం. చీఫ్ జస్టిస్ ప్రదర్శించిన ఈ అసంతృప్తి ప్రభావం అదేరోజు మధ్యాహ్నం మరో ముఖ్యమైన కేసుపై ఉండటం మరో విశేషం.


మలయాళం టెలివిజన్ చానెల్ ‘మీడియా వన్’ వ్యవహారం విచిత్రమైనది. సుప్రీంకోర్టు పుణ్యామాని అది తిరిగి ప్రసారాలు ఆరంభించుకోగలిగినా అందుకు సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చింది. ఈ ఏడాది జనవరి 31న కేంద్రప్రభుత్వం నుంచి దేశభద్రతరీత్యా మీ లైసెన్సును రెన్యువల్ చేయడం లేదని ఓ నోటీసు అందింది. లైసెన్సు రద్దు నిర్ణయాన్ని సదరు చానెల్ హైకోర్టులో సవాలు చేసినప్పుడు, దేశభద్రతతో ముడిపడిన ఈ సమాచారాన్ని తాను రహస్యంగా పంచుకుంటానని చెప్పి కేంద్రప్రభుత్వం సీల్డు కవర్ అందించింది. అందులో ఏమున్నదో తనకూ తెలియచేయాలన్న చానెల్ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. సీల్డు కవర్ లో సమాచారం చూసిన తరువాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడం సముచితం కాదని న్యాయమూర్తి తేల్చేశారు. ఆ నిర్ణయాన్ని సదరు చానెల్ త్రిసభ్య ధర్మాసనం ముందు సవాలు చేస్తే, అదే సీల్డు కవర్ పునాదిగా సింగిల్ జడ్జి ఉత్తర్వులనే సమర్థించింది. దేశ ఇంటలిజెన్స్ సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారుల కమిటీ ఒకటి లైసెన్సు పునరుద్ధరణ కూడదని సూచించిందనీ, తగినన్ని ఆధారాలతో ఈ నిర్ణయం జరిగిందనీ దేశభద్రత రీత్యా తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే, ఈ దశలో కూడా సదరు చానెల్ కు తన తప్పేమిటో, ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియకుండా పోయింది.


గత ఏడాది మే నెలలో ఈ చానెల్ పదేళ్ళ లైసెన్సు రెన్యువల్ కోసం దరఖాస్తుచేసుకుంటే, మొన్న నవంబరులో మిగతా దశలన్నీ దాటినా, డిసెంబరు చివర్లో హోంశాఖ భద్రతాకారణాలు చూపి మోకాలడ్డింది. దీని ఆధారంగా ‘నీ దరఖాస్తును మేము ఎందుకు తిరస్కరించకూడదు?’ అన్న ప్రశ్నతో ప్రసారశాఖ చానెల్ కు నోటీసు ఇచ్చింది. తాను చేసిన తప్పిదమేమిటో తెలిస్తేనే కదా సమాధానం చెప్పుకోగలుగుతానని చానెల్ వాదన. కానీ, దానిమీద ఉన్న అనుమానాలు, ఆరోపణలు ఏమిటన్నవి ఏ దశలోనూ చివరకు న్యాయస్థానాల్లో కూడా దానికి తెలియకుండానే ప్రసారాలు నిలిచిపోయాయి. చేసిన తప్పేమిటో చెప్పకుండా శిక్ష ఎలా వేస్తారన్నది ప్రశ్న. సమాచారహక్కునీ, పత్రికాస్వేచ్ఛనీ, మనుగడ హక్కుని ఇలా ఏకపక్షంగా కాలరాయడం సరికాదనీ, 350మంది ఉద్యోగులతో పదేళ్ళుగా నడుస్తున్న చానెల్ ను ఇలా రహస్య అభియోగాలతో మూసేయడమేమిటన్న వాదన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం వారం క్రితం కేంద్రప్రభుత్వ ఆదేశాలను నిలిపివేసింది. ఆర్నెల్ల మూసివేత అనంతరం ఇలా తాత్కాలికంగా ఒడ్డునపడినప్పటికీ, తనమీద ఉన్న ఆరోపణలేమిటో ఇప్పటికీ చానెల్ కు తెలియకపోవడం విచిత్రం. వాదనలు కొనసాగుతున్న దశలో సుప్రీంకోర్టు సీల్డు కవర్ విధానంపై అసంతృప్తి ప్రకటిస్తూ పిటిషన్ దారుతో సమాచారాన్ని పంచుకోవడం న్యాయమని అన్నది. ఈ కేసు పరిధిని మరింత విస్తరించి ఈ సీల్డుకవర్ న్యాయం గురించి అంతిమంగా ఓ నిర్ణయం తీసుకోవాలని కూడా వ్యాఖ్యానించింది. గతంలో రాఫెల్, బీమా కోరేగావ్, ఎన్ ఆర్ సీ తదితర తీవ్రమైన అంశాల్లోనూ సుప్రీంకోర్టు సీల్డు కవర్ల ఆధారంగానే తీర్పులు ప్రకటించిన, శిక్షలు వేసిన విషయం తెలిసిందే. ఇకపై, సర్వోన్నత న్యాయస్థానం ఈ విధానానికి వ్యతిరేకంగా నిలబడి బహిరంగవాదోపవాదాలమధ్య, పారదర్శకతతో బాధితులకు సముచితం న్యాయం దక్కేట్టు చేయాలని న్యాయనిపుణుల కోరిక.

Updated Date - 2022-03-23T06:13:13+05:30 IST