నాడు ప్రేమన్నాడు.. నేడు పొమ్మన్నాడు!
పెద్దల సమక్షంలోనే భార్యపై దాడి
ఇరు పక్షాల ఘర్షణ
రంగ ప్రవేశం చేసిన పోలీసులు
ఆసుపత్రిలో చేరిన బాధితురాలు
ఏలూరు: కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలుద్దామని ప్రగల్భాలు పలికిన ఘనుడు పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రుకు చెందిన చొదిమెళ్ళ సాయి లక్ష్మి (25) బీటెక్ చదివింది. ఆమెను పెదవేగి మండలం సీతాపురానికి చెందిన దిమ్మక రమేష్ (27) ప్రేమించాడు. తొలుత రమేష్ తరఫు వారు పెళ్లికి నిరాకరించినా అనంతరం ఒప్పుకున్నారు. ఈ ఏడాది మార్చి 2న వివాహం చేసి వారిని ఒక హోటల్లో ఉంచారు. వారంలోపే రమేష్ సోదరుడు వచ్చి బంధువు ఒకరు చనిపోయారంటూ రమేష్‌ను తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి అతను రాకపోవడం, సాయిలక్ష్మి అంటే ఇష్టం లేదని చెప్పడంతో చివరకు ఆమె తన ఇంటికి వెళ్ళి పోయింది.
విషయాన్ని ఎంఆర్పీఎస్ నాయకులకు చెప్పడంతో వారు సమస్య పరిష్కారానికి ఏలూరు మంచినీటి తోటలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి కార్యాలయం వద్ద మంగళవారం పంచాయితీ పెట్టారు. చివరకు రమేష్ ఆమెను కాపురానికి తీసుకు వెళ్ళడానికి అంగీకరించాడు. బయటకు రాగానే ఆమెపై దాడి చేయడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. దీంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో ఏలూరు టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందరినీ చెదరగొట్టి బాధితురాలైన సాయిలక్ష్మిని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఏలూరు టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.