Abn logo
Mar 30 2020 @ 04:56AM

క్రైమ్‌ (లాక్‌) డౌన్‌

గత వారం రోజుల్లో గణనీయంగా తగ్గిన నేరాలు

ప్రజలు ఇళ్లకే పరిమితం కావడమే కారణం

అత్యాచారాలు, మహిళలపై వేధింపులు, దొంగతనాలు, సైబర్‌ నేరాలు కూడా..

వాహనాల రాకపోకలపై ఆంక్షలతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కరోనా వైరస్‌ ప్రభావంతో నగరంలో వివిధ రకాల నేరాలు గణనీయంగా తగ్గిపోయాయి. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు రోడ్లపైకి రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర సరుకుల రవాణా, అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో రోడ్డు ప్రమాదాలు సైతం బాగా తగ్గిపోయాయి. గత నెలతో, అదే విధంగా గత ఏడాది ఇదే సమయంలో జరిగిన నేరాలు, ప్రమాదాలను పరిశీలిస్తే  సగానికిపైగా తగ్గాయి. అత్యాచారాలు, మహిళలపై వేధింపులు, దొంగతనాలు, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాల మరణాలు చాలా స్పల్పంగా జరిగాయని అధికారులు చెబుతున్నారు.

 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు పూర్తిగా మూతపడగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగులకు షిఫ్ట్‌లవారీగా సెలవులు మంజూరు చేశారు. దీనివల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తుండడంతో రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. అందరూ ఇళ్లలోనే ఉంటుండడం, మరికొందరు వీధుల్లోని రోడ్లపై కూర్చొని గడపడం వల్ల చోరీలు, దోపిడీలకు ఆస్కారం లేకుండా పోయింది. గతంలో మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, వేధింపులకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. గత వారం రోజులుగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత నెలలో అత్యాచారం కేసులు 16 నమోదుకాగా, ఈ నెల 27 వరకు ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయి.


మహిళలపై వేధింపులకు సంబంధించి గత నెలలో 42 కేసులు నమోదుకాగా, ఈ నెల 27నాటికి 27 కేసులు నమోదయ్యాయి. చీటింగ్‌, నమ్మకద్రోహానికి సంబంధించి గత నెలలో 87 కేసులు నమోదు కాగా ఈ నెల 27 నాటికి 42 కేసులు నమోదయ్యాయి. సైబర్‌ నేరాలకు సంబంధించి గత నెలలో 44 కేసులు నమోదుకాగా, ఈ నెల 27 నాటికి 27 మాత్రమే నమోదయ్యాయి. సొత్తు అపహరణ, దోపిడీ, ఇళ్లలో చోరీలకు సంబంధించి గత నెలలో 75 కేసులు నమోదు కాగా ఈ నెల 27 నాటికి 48 మాత్రమే జరిగాయి. 


రోడ్డు ప్రమాదాలు తగ్గుదల

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండడం వల్ల అత్యవసర పనులు మీద వెళ్లేవారు తప్పితే మిగిలిన ప్రజలు రోడ్లపైకి రావడం లేదు. వాహనాలు సైతం తిరగడంలేదు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలతోపాటు ప్రమాదాల కారణంగా మృతుల సంఖ్య తగ్గింది. గత ఏడాది మార్చిలో 140 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది మార్చి 27 నాటికి 98 ప్రమాదాలు జరిగాయి. అలాగే రోడ్డు ప్రమాదం కారణంగా గత ఏడాది మార్చిలో 27 మంది మృతి చెందగా ఈ ఏడాది మార్చి 27 నాటికి 17 మంది మృతి చెందారు. 

Advertisement
Advertisement
Advertisement