కానిస్టేబుల్‌ అదృశ్యం కేసు క్రైమ్‌బ్రాంచ్‌కు

ABN , First Publish Date - 2020-10-01T08:54:45+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం కేసు దర్యాప్తును ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కేశవదాసుపాలెంకు చెందిన వెంకటరావు ఢిల్లీలో సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవారు...

కానిస్టేబుల్‌ అదృశ్యం కేసు క్రైమ్‌బ్రాంచ్‌కు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం కేసు దర్యాప్తును ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం కేశవదాసుపాలెంకు చెందిన వెంకటరావు ఢిల్లీలో సీఐఎ్‌సఎఫ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవారు. మే 26నసెలవుల కోసం దరఖాస్తు చేసుకోడానికి కార్యాలయానికి వెళ్లి ఆయన తిరిగి రాలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.


వెంకటరావు భార్య రాజకుమారి ఢిల్లీ హైకోర్టులో హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, న్యాయమూర్తులు జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ రజినీశ్‌ భట్నాగర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు కె.శ్రవణ్‌కుమార్‌, ఆర్‌.బాలాజీ వాదనలు వినిపించారు. ఉస్మాన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌, సీఐఎ్‌సఎఫ్‌ పరస్పర విరుద్ధమైన అఫిడవిట్లు దాఖలు చేశాయని తెలిపారు. మే 26న వెంకటరావు అదృశ్యమైతే, జూన్‌ 4న పోలీసులు కేసు నమోదు చేశారని, కానీ, మే 28నే కేసు నమోదైనట్టు సీఐఎ్‌సఎఫ్‌ అంటోందని వివరించారు. అదృశ్యమై నాలుగు నెలలు గడుస్తున్నా దర్యాప్తులో పురోగతి లేదని తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. దర్యాప్తులో పోలీసులు సరిగ్గా వ్యవహరించడం లేదని ఆక్షేపించింది. నిష్పక్షపాత దర్యాప్తు కోసం కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు నెలల్లో కేసుపై నివేదిక అందించాలని క్రైమ్‌ బ్రాంచ్‌ను ఆదేశించింది.   

Updated Date - 2020-10-01T08:54:45+05:30 IST