వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-27T06:37:48+05:30 IST

మల్లేపల్లి సీతారాంబాగ్‌

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య


డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో సీజ్‌ అయిన ఆటో తిరిగి రాదేమోననే మనస్తాపంతో ఒకరు.. ఆర్థిక ఇబ్బందులతో మరొకరు.. ప్రియురాలు మాట్లాడడం లేదని ఇంకొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మూడు ఘటనలూ హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో చేటు చేసుకున్నాయి. హబీబ్‌నగర్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు.

మంగళ్‌హాట్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : మల్లేపల్లి సీతారాంబాగ్‌ ప్రాంతంలో నివాసం ఉండే యూ విష్ణువర్థన్‌(42)కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. విష్ణువర్థన్‌ ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడగా ఆటోను తిరిగి తెచ్చుకున్నాడు. ఈ నెల 23వ తేదీ శనివారం గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మరో మారు పట్టుబడ్డాడు. అసలే ఆర్థిక ఇబ్బందులతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న విష్ణువర్థన్‌ ఆటో సీజ్‌ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. 24న విషం తాగాడు. వాంతులు కావడంతో ఇంట్లో వారు ప్రశ్నించగా విషయం చెప్పాడు. వారు వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం 11.30 సమయంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


ఆర్థిక ఇబ్బందులతో...

దోబీఘాట్‌ ప్రాంతంలో నివాసం ఉండే దుర్గేష్‌ సింగ్‌(30) లకిడీకాపూల్‌లోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య వందన, నాలుగు నెలల పాప ఉంది. కొంత కాలంగా ఆర్థిక  ఇబ్బందులతో సతమతమవుతున్న దుర్గేష్‌ సింగ్‌ ఈ నెల 19వ తేదీ అర్థరాత్రి యాసిడ్‌ తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. 


ప్రియురాలు మాట్లాడడం లేదని...

జార్ఖండ్‌  కోడెర్మా జిల్లాకు చెందిన పింటూ కుమార్‌ సింగ్‌(24) గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో నగరానికి వలస వచ్చి బోయిగూడ కమాన్‌ వద్ద తన సోదరుడు మంటూకుమార్‌ సింగ్‌, స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. మంగళ్‌హాట్‌లోని ఫ్లైవుడ్‌ గోదాంలో పని చేస్తున్నాడు. పింటూకుమార్‌ సింగ్‌ జార్ఖండ్‌లో మరో యువతితో చనువుగా ఉంటున్నాడు. ఆమె మాట్లాడడం లేదనే కారణంగా మనస్తాపానికి గురైన పింటూ ఈ నెల 25వ తేదీ ఆదివారం రూమ్‌లో ఎవరూ లేని సమయంలో తనతో మాట్లాడాలని ఆమెకు వాయిస్‌ మెసేజ్‌లు పంపాడు. ఆమె స్పందించకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూమ్‌ వద్దకు వచ్చిన పింటూ సోదరుడు మంటూ రూమ్‌ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. బలవంతంగా డోర్‌ను తెరవడంతో పింటూ దూలానికి వేలాడుతూ కనిపించాడు. హబీబ్‌నగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-27T06:37:48+05:30 IST