ఈజీ మనీ కోసం బెట్టింగ్‌లు

ABN , First Publish Date - 2020-12-01T04:13:47+05:30 IST

అమాయకుడనకున్న కన్న కొడుకే ఆ తల్లి పాలిట యముడయ్యాడు.

ఈజీ మనీ కోసం బెట్టింగ్‌లు
రావల్‌కోల్‌లో సాయినాథ్‌రెడ్డి ఇల్లు

  • కాజేసిన డబ్బు విషయం బయటపడుతుందనే తల్లి, చెల్లిల హత్యకు పన్నాగం
  • వండుతున్న అన్నంలోనే గుళికల మందు కలిపిన క్రూరుడు 


మేడ్చల్‌ : అమాయకుడనకున్న కన్న కొడుకే ఆ తల్లి పాలిట యముడయ్యాడు. తండ్రి లేకున్నా అన్నయ్యే అన్నీ చూసుకుంటాడనుకున్న ఆ చెల్లెలి ప్రాణం తీశాడు. జల్సాలకు అల వాటు పడి బ్యాంకు, ఇంట్లోని డబ్బును బెట్టింగులో పెట్టిన విష యం ఎక్కడ బయటపడుతుందో నని తల్లి, చెల్లిని చంపిన సాయినాథ్‌రెడ్డి ఘాతుకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలోనే బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. ఆ తరువాత ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ ఆ వ్యాపకం మానలేదు. ఈ క్రమంలో దాదాపు రూ.25 లక్షల వరకు అప్పులు కావడంతోపాటు ఆన్‌లైన్‌లో 2లక్షల వరకు రుణాలు తీసుకున్నాడు. అప్పులవారి నుండి ఒత్తిడి పెరగడంతో బ్యాంకులో దాచుకున్న డబ్బుతోపాటు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తల్లి, చెల్లి తెలియకుండా కాజేశాడు. విషయం ఎక్కడ బయటపడుతుందోనని వారిని కడతేర్చాలని పన్నాగం పన్నాడు. ఈనెల 23న మేడ్చల్‌లోని ఓ ఫర్టిలైజర్‌ షాప్‌లో మొక్కజొన్న పంటకు పురుగుల మందు కావాలని తీసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి వండుతున్న అన్నంలో పురుగుల మందు కలిపి ఏమీ ఎరగనట్లు అదే అన్నం టిఫిన్‌లో పెట్టుకొని కంపెనీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి స్నేహితుల రూంకు చేరుకున్నాడు. అక్కడ అన్నం పడేశాడు. ఇదేమీ తెలియని తల్లి సునీత, చెల్లెలు అనూష పురుగుల మందు కలిపిన అన్నం తిని అస్వస్థతకు గురయ్యారు. అదేరోజు రాత్రి చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన సాయినాథ్‌రెడ్డి మరుసటిరోజు ఆసుపత్రిలో బిల్లులు చెల్లించేందుకు బ్యాంకు నుంచి డబ్బు తీసుకురావాలని బంధువులు కోరగా.. డిపాజిట్‌ రూపంలో ఉన్నాయని దాటవేశాడు. అనుమానం వచ్చిన తల్లి సాయినాథ్‌రెడ్డిని ప్రశ్నించగా.. తాను ఏమీ చేయలేదని తెలిపాడు. రెండురోజుల తరువాత బంధువులు గట్టిగా నిలదీయడంతో బ్యాంకులో డబ్బులు లేవని తెలిపాడు. దీనితో సాయినాథ్‌రెడ్డిని మరింత గట్టిగా నిలదీయడంతో అన్నంలో మొదట శానిటైజర్‌ కలిపానని, మరోసారి నిద్రమాత్రలు కలిపానని తెలిపాడు. బంధువులు ఇంటికి వెళ్లి చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. అప్పటికే 27న చెల్లి, 28న తల్లి మృతిచెందారు. అప్పటివరకు సాయినాథ్‌రెడ్డి ఎంతో అమాయకుడని నమ్మిన బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో సాయినాథ్‌రెడ్డి వండే అన్నంలో పురుగుల మందు కలిపాడని బయటపడింది. దీంతో పోలీసులు సోమవారం సాయినాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 


మత్తులో యువత..? 

 రావల్‌కోల్‌లో చాలామంది యువకులు గంజాయికి అలవాటుపడి డబ్బు కోసం ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న రాజబొల్లారంలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తుందని, యువత దీనికి అలవాటు పడి చెడుమార్గం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘాపెట్టి మత్తు పదార్థాలు విక్రయించకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-01T04:13:47+05:30 IST