రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

ABN , First Publish Date - 2020-11-29T05:10:47+05:30 IST

జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

  1.   ఒకరికి తీవ్ర గాయాలు  
  2.   వేర్వేరు చోట్ల ఘటనలు 


నంద్యాల (నూనెపల్లె), నవంబరు 28: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుడి వివాహానికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శిరివెళ్ళ మండలం బోయిలకుంట్ల - దీబగుంట్ల రహదారిలో వాహనాన్ని బైక్‌ ఢీకొనడంతో ఖురేషీ జుబేర్‌ (23), షమీర్‌ (20) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రంగనాయకులును నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


  శిరివెళ్ళ పోలీసులు తెలిపిన మేరకు.. నంద్యాల పట్టణంలోని చాంద్‌బడాకు చెందిన అన్వర్‌ బాషా కొడుకు జుబేర్‌ (23), జమాల్‌ కొడుకు షమీర్‌ (20), శ్రీనివాసులు కొడుకు ఇమ్మిడి రంగనాయకులు స్నేహితులు. మహానంది మండలం బోయిలకుంట్లలో స్నేహితుడి వివాహానికి శనివారం ముగ్గురూ బైక్‌పై వెళ్లారు. వేడుకలు ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. బోయిలకుంట్ల - దీబగుంట్ల రహదారిపై అతివేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న బులేరో వాహనాన్ని ఢీకొన్నారు. దీంతో జుబేర్‌, షమీర్‌ తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రంగనాయకులును నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


  విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలవారు, బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. జుబేర్‌, షమీర్‌ మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. తీవ్రంగా గాయపడిన రంగనాయకులుకు ప్రాఽథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో శాంతిరామ్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో జుబేర్‌కు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. శిరివెళ్ళ ఎస్‌ఐ సూర్యమౌళి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


గూడూరు: గూడూరు మండలంలోని కె.నాగులాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సల్కాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం బూడిదపాడు గ్రామానికి చెందిన రాముడు (49) మృతి చెందాడు. ఎస్‌ఐ కేశవ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన డ్రైవర్‌ వెంకటేశ్వరరావు కారు నడుపుకొంటూ కోడుమూరు నుంచి కర్నూలు వైపు అతివేగంగా వెళ్తున్నాడు. వేగాన్ని అదుపు చేసుకోలేక కర్నూలు నుంచి బూడిదపాడుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్డాడు. రాముడుకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. రాముడు అల్లుడు మహేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


 తుగ్గలి: కర్నూలు వెళ్లి తిరిగి వస్తూ తుగ్గలి మండలంలోని రాతన చెరువు కట్ట సమీపం వద్ద శనివారం రాత్రి ద్విచక్రవాహనం నుంచి పడి ఆర్‌ఎంపీ వైద్యుడు రంగనాథ్‌ (46) మృతి చెందారు. మద్దికెర మండ లంలోని పెరవలి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ రంగనాథ్‌ కర్నూలుకు వెళ్లి వస్తూ రాత్రి కళ్లు తిరిగి బైక్‌పై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నూలు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వాహనం నడుపుతున్న వ్యక్తి నాగేష్‌ చెప్పారని తుగ్గలి పోలీసులు తెలిపారు. రంగనాథ్‌కు భార్య కళ్యాణి ఉన్నారు. తుగ్గలి ఏఎస్‌ఐ మాధవస్వామి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2020-11-29T05:10:47+05:30 IST