ఆకలి కేకలు!

ABN , First Publish Date - 2022-01-21T09:37:54+05:30 IST

దేశంలో ఆకలిచావులు లేవని గట్టిగా వాదించిన కేంద్రప్రభుత్వం, అందుకు సమర్థనగా చూపడానికి తన వద్ద డేటా లేదని చెప్పడం సుప్రీంకోర్టుకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలిగించింది..

ఆకలి కేకలు!

దేశంలో ఆకలిచావులు లేవని గట్టిగా వాదించిన కేంద్రప్రభుత్వం, అందుకు సమర్థనగా చూపడానికి తన వద్ద డేటా లేదని చెప్పడం సుప్రీంకోర్టుకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కూడా కలిగించింది. ఆకలి తీర్చండి, పేదవాడి కడుపునింపండి అంటూ సుప్రీంకోర్టు ఒక ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రభుత్వం వెంటపడుతోంది. సామూహికవంటశాలల ఏర్పాటు గురించి రాష్ట్రాలతో కలసి లోతుగా ఆలోచించమంటోంది. కానీ, వరుస సందర్భాల్లో అటార్నీ మాటలు విన్న తరువాత పాలకులకు ఈ విషయంలో పెద్దగా పట్టింపులేదనీ, వారిని ముందుకు తోయాలంటే తాను మరింత దృఢంగా ఉండాలని న్యాయస్థానానికి అర్థమై ఉంటుంది.


సర్వోన్నతన్యాయస్థానంలో మంగళవారం జరిగిన చర్చ పాలకుల ఉదాసీనతకు ఉదాహరణ. ఆకలిచావులు సంభవించినట్టు ఒక్క రాష్ట్రంనుంచి కూడా తమకు సమాచారం లేదని అటార్నీ చెబుతూ కేంద్రం వద్ద విడిగా ఏ డేటా ఉండదని తేల్చేశారు. వివిధ దేశ, విదేశీ నివేదికలు ఇక్కడి ఆకలి గురించి చేసిన ప్రస్తావనలను సుప్రీంకోర్టు గుర్తుచేసినప్పుడు, తన వాదన పూర్తిగా రాష్ట్రాల డేటామీద ఆధారపడిచేసిందన్నారు అటార్నీ. ఆరేళ్ళనాటి డేటా ఆధారంగా దేశంలో ఆకలీలేదు, చావులూ లేవని విచిత్రవాదనలు చేసిన అటార్నీని పలు దశల్లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది, విమర్శించింది, నిలదీసింది. సామూహిక వంటశాలల ఏర్పాటు విషయంలో కొన్ని రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలను గమనంలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది. వంటశాలల ఏర్పాటు వ్యయాన్ని కేంద్రం భరించడం, రెండుశాతం ఆహారధాన్యాలను అదనంగా రాష్ట్రాలకు అందించడం వంటివి ఇందులో ఉన్నాయి. కేంద్రం ఒక నమూనాను రూపొందించి, సహకరిస్తే రాష్ట్రాలు వాటిని నిర్వహించవచ్చునని ఆలోచన.


సామూహికవంటశాలల ఏర్పాటు విషయంలో పాలకుల అలసత్వం ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టుకు ఆగ్రహం కలిగించింది. సెక్రటరీ లేదా ఆపైస్థాయి అధికారులు మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేయాలని సర్వోన్నతన్యాయస్థానం గతంలో చెప్పినా ఈ పిటిషన్ విషయంలో కిందిస్థాయి అధికారి ఒకరు అఫిడవిట్ సమర్పించారు. ఇప్పుడు ఇంతటి కొవిడ్ కష్టకాలంలో కూడా ఒక్క ఆకలిచావూ నమోదుకాలేదని చెబుతున్న కేంద్రం, కనీసం పిటిషనర్ల మాదిరిగా తమ వాదనకు మద్దతుగా డేటా ఇవ్వకపోవడం విచిత్రం. ప్రపంచ ఆకలిలో నాలుగోవంతు భారత్ లో ఉన్నదనీ, ఇది ఆసియా సగటును దాటిపోయిందనీ, దేశంలో ప్రతిరోజూ 19కోట్లమంది ఆకలితోనే నిద్రపోతున్నారనీ, నాలుగున్నరవేలమంది పిల్లలు ఆకలి, పోషకాహారలోపం వల్ల రోజూ చనిపోతున్నారని పిటిషనర్లు ప్రభుత్వనివేదికల ఆధారంగానే వాదించారు. పోషకాహారలోపం నిజం కావచ్చుకానీ, ఆకలికేకలూ చావులూ లేవని కేంద్రం అంటున్నది. ప్రభుత్వ వాదనలో డొల్లతనాన్ని ఎత్తిచూపడం కోసమే కావచ్చు, తమిళనాడులో సరిగ్గా నెలరోజుల క్రితం సంభవించిన ఆకలిచావును న్యాయస్థానమే పరోక్షంగా ప్రస్తావించింది. విల్లుపురంలో కన్నుమూసిన ఈ ఐదేళ్ళపిల్లవాడి శవపరీక్ష జరిపినప్పుడు అతడు రెండుమూడురోజులుగా ఏమీ తినలేదని నిర్థారణ అయింది. అలాగే, 2018లో ఢిల్లీలో ముగ్గురు పిల్లలు దాదాపు వారం పాటు తిండికి నోచుకోక ఆకలిచావుకు గురైన విషయం తెలిసిందే. తీవ్రమైన పోషకాహారలోపం ఎన్నో పసిప్రాణాలను హరిస్తున్న విషయం మనకు తెలియనిదేమీ కాదు. 2018లోనే 8లక్షలమంది పిల్లలు ఆహారలేమితో కన్నుమూశారని యునిసెఫ్ ప్రకటించింది. ఇక కొవిడ్ కమ్ముకొచ్చినదశలో దేశం ఎన్నడూ చూడనటువంటి దృశ్యాలను చూసింది. ఆదాయాలు కోల్పోయిన లక్షలాది కుటుంబాలు దుర్భరదారిద్ర్యంలోకి జారిపోయాయి. వలసకూలీల దీనావస్థ, అసంఘటితరంగ కార్మికుల కష్టాలు తెలియనివేమీ కావు. ఇవన్నీ పట్టించుకోకుండా, ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన వాస్తవాలను గుర్తించనిరాకరిస్తూ కేంద్రప్రభుత్వం ఏం సాధించదల్చుకుందో తెలియదు. రాష్ట్రాల వైఫల్యాన్ని ప్రశ్నించే నీతి ఆయోగ్ నివేదిక, 116 దేశాల ఆకలిసూచీలో భారత్‌కు దక్కిన 101 స్థానం వంటివి చేదునిజాలే చెబుతున్నాయి. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లను సైతం వెనక్కునెట్టేసిన మన ఘనతను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చాటిచెప్పినందుకు దానిని సైతం తప్పుబట్టింది కేంద్రం. క్షేత్రస్థాయి వాస్తవాన్ని గుర్తించనిరాకరించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. దేశంలో ఎవరూ ఎక్కడా తిండికోసం అలమటించాల్సిన దుర్గతి లేకుండా చూడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.

Updated Date - 2022-01-21T09:37:54+05:30 IST